సిటీబ్యూరో, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో సెంట్రల్ క్రైమ్స్ స్టేషన్, సైబర్ క్రైమ్స్, మహిళా భద్రతా విభాగాలు ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ మూడు విభాగాలు అధునాతన సాంకేతికతతో నేరాలను నియంత్రించే దిశగా సమర్ధవంతంగా పనిచేయాలని హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సీసీఎస్, సైబర్‌క్రైమ్స్, మహిళాభద్రతా విభాగాలతో అడిషనల్ సీపీ శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో క్రైమ్, సైబర్, విమెన్ పోలీసు బృందాల పనితీరు, పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక విభాగాలు ప్రధానంగా నేరాల మూలాలను నివారించడానికి, నేర నమూనాలను అర్థం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నేరస్తులు ఉపయోగించే టెక్నాలజీపై అప్రమత్తంగా ఉండడం, వైట్‌కాలర్,సైబర్‌నేరాలతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడం, మహిళల భద్రతను పెంచడం, దర్యాప్తు ప్రమాణాలను మెరుగుపరచడం వంటి పలు అంశాలపై చర్చించారు. కేసుల దర్యాప్తు విషయంలో డాక్యుమెంటేషన్ బలంగా ఉండాలని ఫోరెన్సిక్, డిజిటల్ సాధనాలను ఉపయోగించాలని పోలీసులకు సూచించారు. ప్రజాభద్రతను పెంపొందించడంలో ఈ మూడు విభాగాలు సమర్థవంతంగా పని చేస్తాయని, పోలీసులు, ప్రజల మధ్య నమ్మకం పెంపొందించేలా వ్యవహరించాలని అడిషనల్ సీపీ శ్రీనివాస్ అన్నారు. డీసీపీలు దారా కవిత, డా.లావణ్య, సీసీపీ అడిషనల్ డీసీపీ మనోహర్, క్లూస్‌టీమ్ జాయింట్ డైరెక్టర్ డా.వెంకన్న , ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.