
ఇతని పేరు చందు. ప్రైవేటు ఉద్యోగి. అతని తండ్రి, సోదరుడు మరణించారు. వారి జ్ఞాపకాలన్నీ తన స్మార్ట్ ఫోన్లోనే భద్రమై ఉన్నాయి. ప్రతిరోజు ఒకసారైనా వాటిని చూసుకొని తనవారిని గుర్తు చేసుకోవడం చందుకు అలవాటు. ఇటీవల ఉద్యోగం కోసం వెళ్తుండగా మాదాపూర్ పీఎస్ పరిధిలో రోడ్డుపై ఫోన్ పడిపోయింది. ఆఫీసుకు వెళ్లి చూసుకోగానే ఫోన్ కనిపించకపోవడంతో ప్రాణం పోయినట్లయ్యింది. ఫోన్ పోయిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారో లేదోన్న అనుమానం. కానీ.. అందులో ఉన్న జ్ఞాపకాలు తిరిగి ఎక్కడా దొరకవు కదా.. ధైర్యం చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన ఫోన్ పోయిన సంగతి.. అందులో ఉన్న జ్ఞాపకాల గురించి వివరించారు. ఫిర్యాదు తీసుకున్న వారు.. సరిగ్గా 20 రోజులకు చందుకు కబురు పెట్టారు. మీ ఫోన్ దొరికింది వచ్చి తీసుకెళ్లండి అని చెప్పారు. ఒక్కసారిగా అతని కండ్లలోంచి ఆనంద బాష్పాలు పెల్లుబికాయి. ఫోన్ తీసుకోగానే.. వెంటనే దాన్ని గుండెలకు హత్తుకున్నాడు. పోలీసులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు.
సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సెల్‌ఫోన్ జీవితంలో ఓ భాగంగా కాదు.. ప్రాణంగా మారిపోయింది. వాటిని పొగొట్టుకున్న వారు తిండి, నిద్రలను కూడా కోల్పోతున్నారు. దానిని తిరిగి పొందేందుకు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రతి బాధితుడి ఆవేదనలో ఓ మానవీయ కోణం ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్లకు సెంటిమెంట్ కూడాఉండడంతో పోయినఫోన్లు దొరికేంత వరకు పోలీస్స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్‌లో అత్యంత బిజీ బిజీగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతంలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది దాదాపు 800 మొబైల్ ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల్లో వారికి ఉన్న సెంటిమెంట్, వాటి కొనుగొలుకు వారు పడ్డ కష్టాలు, అందులో ఉన్న జ్ఞాపకాల గురించి తెలుసుకుని మాదాపూర్ పోలీసులు దాదాపు 400 ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి వారికి అప్పగించారు. మిగతా వాటి కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు. చక్కర్లు కొడుతున్న బాధితులకు మీ ఫోన్ గ్యారంటీగా మీకు అప్పజెప్పడానికి ప్రయత్నిస్తున్నామని భరోసా ఇస్తున్నారు.
ఐఎంఈఐ నెంబరు ఉండాల్సిందే..
ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయాలనుకున్న వారు కచ్చితంగా ఐఎంఈఐ నెంబరుతో ఫిర్యాదు చేయాలి. ఆ నెంబరు ఉంటేనే పోయిన ఫోన్‌ను ట్రాక్ చేయొచ్చు. ఒకసారి చోరీకి గురైన ఫోన్ ఇతరులకు దొరికినా వాటిని స్విచ్ ఆఫ్ చేసి పాత సిమ్‌ను తీసేసి కొత్త సిమ్ వేసుకున్నా వాటిని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ట్రాక్ చేయవచ్చు. ఫోన్‌ను రికవరీ చేసి బాధితుడికి అప్పగించవచ్చు.
నా ఆవేదనే సేవకు మార్గమైంది.
కొన్ని సంవత్సరాల కిందట నా పనిని మెచ్చుకుని ఓ అధికారి, నా గురువు ఓ కొత్త ఫోన్‌ను బహుమతిగా ఇచ్చారు. కొద్ది రోజులు వాడిన తర్వాత ఆ ఫోన్ పోయింది. అపుడు నాలో కలవరం అంతా ఇంతా కాదు. గురువు గారు ఇచ్చిన ఫోన్‌ను పొగొట్టుకున్నాను అని తెగ బాధపడ్డాను. నేనే స్వయంగా ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకోవడానికి 25 రోజులు పట్టింది. ఆ 25 రోజులు పడిన ఆవేదన నాకు ఇంకా గుర్తుంది. నాలుగు రోజులు భోజనం కూడా చేయలేదు. నేను పడిన బాధ మరొకరు పడకూడదని ఫోన్ పోయిందని వచ్చే బాధితులకు సాయపడుతున్నాను. నా వంతుగా ప్రతి ఫిర్యాదును తీసుకుని వెతికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాను. ఫోన్ ఇచ్చేటపుడు వారి ముఖంలో ఆనందం చూస్తే నాకు చాలా సంతోషమేస్తుంది. – లక్ష్మప్ప, రైటర్, మాదాపూర్ పీఎస్
సూర్యకుమార్… ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ప్రతి రోజు క్లయింట్స్ డాటా, వారి ఫోన్ నెంబర్లు, ఆఫీసు షెడ్యూల్ .. ఇలా అనేక విషయాలు, యూపీఐ బ్యాంకింగ్ అంశాలు అన్నీ ఫోన్లోనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఆఫీసు టైమ్ అవుతుందని హడావిడిగా బైక్‌పై వెళ్తుండగా ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఆఫీసుకు చేరుకున్నాక చూస్తే ఫోన్ కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే 15 రోజులలో ఫోన్ అప్పగించారు. అప్పుడే అతడికి టెన్షన్ రిలీఫ్ అయ్యి ఆరోగ్యం కుదుటపడింది. ఉద్యోగం నిలబడింది.
నాగలక్ష్మీ.. ఓ మధ్యతరగతి మహిళ. భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నది. కరోనా కారణంగా పిల్లలకు ఆన్లైన్ తరగతులు నడుస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పిల్లల భవిష్యత్ కోసం రూపాయి రూపాయి జమ చేసి స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. కుటుంబసభ్యులతో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా ఫోన్ పోయింది. కష్టపడి కొన్న ఫోన్ కనిపించకపోవడంతో కన్నీళ్లు ఆగలేదు. బోరున ఏడ్చేసింది. కుదటపడ్డాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోన్‌ను తిరిగి ఇచ్చారు. ఇప్పుడు ఆమె పిల్లలు హాయిగా ఆన్లైన్ తరగతులు వింటున్నారు.