కవాడిగూడ, ఫిబ్రవరి 8: మధుమేహం (Diabetes) పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హయగ్రీవ్ రావ్ సూచించారు. మధుమేహంతో కలిగే అనర్థాలపై శుక్రవారం రాత్రి హైదరాబాదులోని హోటల్ మారియట్లో జరిగిన సదస్సులో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హయగ్రీవ్ రావ్, ఎండోక్రినాలజిస్టు డాక్టర్ ప్రసున్ దేబ్, కార్డియాలజిస్టు డాక్టర్ సాయి రవిశంకర్, నెఫ్రాలజిస్టు డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. మైక్రో లాబ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మధుమేహంపై రూపొందించిన ఇంట్రిగూయింగ్ కార్డియో డయాబెటిస్ కేసెస్ పుస్తకాన్ని ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలో మధుమేహంలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో ఉందన్నారు.
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని లేనట్లయితే మానవ శరీరంలోని అవయవాలన్నీ చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, కళ్లు తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు. మధుమేహం నుంచి మనను మనం ఎలా కాపాడుకోవాలన్న దానిపై పలు సూచనలు సలహాలు చేశారు. ఇంట్రిగూయింగ్ కార్డియో డయాబెటిస్ కేసెస్ అన్న పుస్తకంలో పొందుపరిచినటువంటి సమాచారం డాక్టర్లతో పాటు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్ వీసీ మురళీకృష్ణ రాజు తదితర డాక్టర్లు పాల్గొన్నారు.