సిటీబ్యూరో, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మరోసారి జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో మూసీ నది నిండుగా ప్రవహిస్తున్నది.
గండిపేట రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో శనివారం ఉదయం 8 గంటలకు 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 960 క్యూసెక్కుల నీటిని మూసీలోకి పంపించారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో పెరుగడంతో 2 గంటలకు మరో అడుగు మేర గేట్లను ఎత్తి మొత్తం 1400 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. సాయంత్రం 6 గంటలకు తెరిచి ఉన్న 4 గేట్లను 3 అడుగుల నుంచి 5 అడుగుల మేర ఎత్తి మొత్తం 2250 క్యూసెక్కుల నీటిని వదిలామని, ప్రస్తుతం గండిపేటకు పైనుంచి 1600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు.
హిమాయత్‌సాగర్ జలాశయానికి వరదనీరు చేరుతున్నది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉండటంతో వచ్చిన నీటిని కిందకు వదులుతున్నారు. శనివారం ఉదయం 8 గంటల వరకు 4 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని వదిలారు. పై నుంచి ఇన్‌ఫ్లో మరింత పెరుగడంతో ఉదయం 11 గంటలకు 4 గేట్లను మరో అడుగు మేర ఎత్తి మొత్తం 2800 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.
మధ్యాహ్నం 1గంటకు మరో 2 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి మొత్తం 6 గేట్ల ద్వారా 4200 క్యూసెక్కులు వదిలారు. సాయంత్రం 6 గంటల సమయంలో మరో 2 గేట్లు 2 అడుగుల మేర ఎత్తారు. మొత్తం 8 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 5600 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 5000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
చాంద్రాయణగుట్ట ఓమర్ హోటల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో మిరాలం ఆలియాబాద్ ఆఫ్‌టెక్ పైల్‌లైన్ అలైన్మెంట్ మార్చాల్సి ఉంది. సోమవారం 11న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు సుమారు 24 గంటల పాటు ఈ పనులు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అండ్ ఎం డివిజన్ నం.1 పరిధిలోని మీరాలం, కిషన్‌బాగ్, అల్జుబైల్ కాలనీ, ఓ అండ్ ఎం డివిజన్ నం.2 పరిధిలోని ఆలియాబాద్, బాలాపూర్ రిజర్వాయర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.