మలక్‌పేట, సెప్టెంబర్ 26ః నాలుగు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో గేట్లు ఎత్తటం, హుస్సేన్ సాగర్ నుంచి నీటిని వదలటంతో మూసీ మహోగ్ర రూపం దాల్చింది. మూసీ పరీవాహక కాలనీలను ముంచెత్తుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ పరీవాహక కాలనీలైన చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, పాత మలక్‌పేటలోని శంకర్‌నగర్ కాలనీల్లోకి నడుము లోతు వరదనీరు చేరటంతో ఇండ్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి.
కాలనీలను ముంచెత్తుతూ మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, పాత మలక్‌పేటలోని శంకర్‌నగర్ కాలనీవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్, పోలీస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందిని సహాయ చర్యల్లోకి దింపారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా ఏర్పాటు చేశారు. చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జిపైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిల పైనుంచి రాకపోకలను నిలిపివేయటంతో చాదర్‌ఘాట్ హైయర్ బ్రిడ్జిపై వాహనాల రద్దీ పెరిగి చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట సూపర్‌బజార్ వరకు ట్రాఫిక్
స్థంభించిపోయింది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల గేట్ల ఎత్తివేతతో మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు శివాజీ బ్రిడ్జి కింద భూ లక్ష్మీ ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని గోడె కీ ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. మూసీ నదిలో నీటి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచందన అన్నారు. సికింద్రాబాద్ రసూల్‌పురాలోని ప్యాట్నీ నాలా వద్ద వరద ఉద్ధృతిని శుక్రవారం ఆమె పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ఇండ్లలోకి నీళ్లు రావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమైతే కలెక్టరేట్ హెల్ప్‌లైన్ నంబర్ 90634 23979కు ఫోన్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం రాత్రి మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు వెయ్యి మందికిపైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.