హైదరాబాద్: గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారులు మూడు గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ ఉధృతంగా ప్రవస్తున్నది. ఈ క్రమంలో మూసారంబాగ్, అంబర్‌పేట బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
మరోవైపు హిమాయత్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో.. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది. దీంతో దానిని పోలీసులు రహదారిని మూసివేశారు. ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్దనున్న సర్వీస్ రోడ్డు వైపు వాహనదారులు రావద్దని సూచించారు.