Hyderabad | సిటీ బ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): తండ్రిని నడిరోడ్డుపై కత్తితో కసితీరా పొడిచి చంపిన ఓ కొడుకు.. అన్నను రోడ్డుపై పరుగెత్తించి పరుగెత్తించి నరికి చంపిన ఓ తమ్ముడు.. కుమారుడిని అతి కిరాతకంగా చితకబాది ప్రాణాలు తీసిన తండ్రి.. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే వ్యామోహంలో ముగ్గురు పిల్లలను చంపేసిన తల్లి.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటనలు ఏవో సినిమాల్లోనో.. కథల్లోనో జరిగినవి కాదు. నిజంగానే జరిగిన అమానుష దారుణాలు.
సొంత రక్త సంబంధీకులనే కర్కశంగా అంతమొందించిన నిజాలు. గడిచిన మూడు నెలల్లోనే ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనుషుల్లో బంధాలు, బంధుత్వాలు సన్నగిల్లిపోతున్నాయని స్పష్టమవుతున్నది. తమను ఇబ్బందులకు గురిచేస్తేనో.. ఏదో ఒక రకంగా తమకు అడ్డుగా ఉన్నారనో.. అయినవారినే కడతేర్చడం తీవ్రంగా కలచివేస్తున్నది. కారణాలేవైనా సొంత మనుషుల ప్రాణాలు తీయడం మానవ సంబంధాలకు ప్రమాదకరంగా మారుతన్నది.
బంధువులు, రక్తసంబంధీకుల హత్యలకు ప్రధానంగా కుటుంబ కలహాలు, దురలవాట్లు, చెడు వ్యసనాలు, వివాహేతర సంబంధాలే కారణాలవుతున్నాయి. మద్యానికి బానిసలై సొంత తల్లిదండ్రులు, కన్న బిడ్డలను చంపడానికి కూడా వెనకాడటంలేదు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో దారుణాలకు ఒడిగడుతున్నారు. కనిపెంచిన తండ్రులు కూతురు, కుమారులను చంపుతున్నారు.
కొడుకులు తల్లిదండ్రులను కడతేరుస్తున్నారు. మత్తుకు బానిసవడం వల్ల నేర ప్రవృత్తి పెరిగిపోయి ఎంతటికైనా వెనకాడటం లేదు. హత్యలకు కారణాలను విశ్లేషించి అటువంటి మనస్తత్వం ఉన్నవారికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం నేరాలుగానే పరిగణించకుండా ప్రత్యేక కేసులుగా గుర్తించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి అడ్డుకట్ట వేయాలి.
పిల్లలను పెంచేతీరుపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులను చూసి పిల్లలు వారిని అనుసరిస్తారు. తల్లిదండ్రులకు మద్యం, వ్యసనాల అలవాటు ఉంటే పిల్లలు కూడా నేర్చుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లలకు అలాంటి అలవాట్లను దూరంగా ఉంచాలి. మనుషులతో ఎలా మెలగాలో చిన్నప్పటి నుంచే నేర్పాలి. దాన్ని మరిచి పిల్లల తీరును ఎప్పటికప్పుడు గమనించకుండా ఉండటం వల్ల చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. తద్వారా తీవ్ర మనస్తత్వం గల వారిగా మారుతూ దొంగతనాలు, హత్యలకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ఎవరినైనా చంపడానికి సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులను, తోబుట్టవులను హతమారుస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే తల్లిదండ్రులు పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆరెగూడేనికి చెందిన సైదులు ఫిబ్రవరి9న తొమ్మిదో తరగతి కుమారుడు స్కూలు నుంచి ఆలస్యంగా వచ్చాడని చితకబాదాడు. దెబ్బలు తట్టుకోలేక బాలుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉండటం వల్లనే కుమారుడిని విచక్షణ రహితంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
* సికింద్రాబాద్‌లోని లాలాపేటకు చెందిన మొగిలి అనే వ్యక్తిని ఫిబ్రవరి 2న కుమారుడు మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. తండ్రి మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ చేస్తున్నాడనే చంపినట్లు యువకుడు పోలీసులకు చెప్పాడు.
* మేడ్చల్‌లో ఫిబ్రవరి 16న నడిరోడ్డుపై ఉమేశ్ అనే వ్యక్తిని సొంత తమ్ముడు మరో వ్యక్తి సాయంతో కత్తితో పొడిచి చంపాడు. దీనికి కూడా ఉమేశ్ మద్యానికి బానిసై తల్లిని కొడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని చంపినట్లు నిందితుడు రాకేశ్ చెప్పాడు.
* హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఇటీవలనే శిరీష అనే మహిళను సొంత ఆడబిడ్డ సరిత మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దిండుతో గొంతును అదిమిపట్టుకుని చంపింది. సరితకు శిరీష భర్త వినయ్, అతడి అక్క కొడుకు నిహాల్ సహకరించడం గమనార్హం. వినయ్, శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు. నర్సుగా పనిచేస్తున్న సరితను తరచూ దవాఖానలు ఎందుకు మారుతున్నావని మందలించినందుకు కోపంతో చంపేసింది.
* హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్‌లో తల్లిని గొడ్డలితో నరికి చంపాడు ఓ కుమారుడు. చదిరం అజయ్‌కు తన తల్లి రేణుకతో కొద్దిరోజులుగా తరచూ గొడవ జరుగుతున్నది. ఈక్రమంలో మార్చి 5న మరోసారి గొడవ జరగడంతో ఆవేశంలో గొడ్డలితో నరికి చంపాడు.
* సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వివాహేతర ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే కామవాంఛతో రజిత అనే మహిళ ఏకంగా తన ముగ్గురు కుమారులను గొంతు నులిమి చంపేసింది. ఆరు నెలల క్రితం రజిత తన పదో తరగతి క్లాస్ మేట్స్ గెట్ టూ గెదర్ కార్యక్రమంలో కలిసిన తన స్నేహితుడు శివతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భర్త రజిత కంటే 20 ఏండ్లు పెద్దవాడు కావడం వల్లనే శివను పెళ్లి చేసుకోవడానికి ఈ దారుణానికి ఒడిగట్టింది.