షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెంజర్ల గ్రామ శివారులోని నిర్జన ప్రదేశంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే వరుస హత్యలు చేసి.. పరారైన రాజ్‌కుమార్ 20 కిలోమీటర్ల పరిధిలోనే మూడు రోజులుగా తచ్చాడినా.. పోలీసులు పట్టుకోలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల హంతకుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. ఈ విషయం పోలీసులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించడంతో ఈ విషయంపై స్థానికంగా దవాహనంలా వ్యాపించింది. అభం శుభం తెలియని కన్న పిల్లలను చంపేయడం, ప్రతీకారంతో బాలికను, ఆమె కుటుంబాన్ని హత్య చేసిన నరరూప రాక్షసుడు ఇంతా ఈజీగా చనిపోతాడా? అంటూ స్థానికులు చర్చించుకున్నారు. గతంలో సంచలనం సృష్టించిన దిశా ఎన్‌కౌంటర్‌ను అందరూ గుర్తు చేసుకున్నారు.
రాజ్‌కుమార్ మృతి చెందిన ప్రాంతానికి గతంలో దిశా ఎన్కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతం పది పన్నెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉండడంతో ఆ ఘటనపై స్థానికులు మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా పెంజర్ల గ్రామ పరిధిలోని నిర్మానుష్యంగా ఉన్న వెంచర్లో రాజ్‌కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను నిర్ధారించేందుకు స్థానికులు, మృతుడికి తెలిసిన వారిని పోలీసులు అక్కడకు పిలిపించారు. అక్కడికి వచ్చిన వారు కూడా మృతుడు ఆరు హత్యల నిందితుడు రాజ్‌కుమార్ అని నిర్ధారించారు.
ఉలిక్కిపడ్డ కొత్తూరు
శుక్రవారం రాత్రి వరుస హత్యలకు పాల్పడిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ కొత్తూరు, తిమ్మాపూర్, చేగూరు ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలియగానే కొత్తూరు ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. అంటే నిందితుడు అక్కడ ఐదారు కిలోమీటర్ల పరిధిలోనే మూడు రోజులుగా తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారనే విమర్శలు విన్పిస్తున్నాయి. నరహంతకుడు మన ప్రాంతంలో తిరిగాడా? అనే విషయం తెలుసుకొని కొత్తూరు మండల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరు హత్యలు చేసి ఇక్కడ దాక్కున్నాడు. పోలీసులు ఏమి చేస్తున్నారు.. నిఘా ఏమైందంటూ సాధారణ ప్రజలు చర్చించుకున్నారు.
ప్యూచర్‌సిటీ అధికారులంతా అక్కడే..
షాబాద్ వరుస హత్యల ఘటన తరువాత నిందితుడు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు లభించడంతోనే నిందితుడు ఆ ప్రాంతంలో ఉండే అవకాశాలున్నాయని ఏకంగా ప్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, షాద్‌నగర్ డీసీపీ శిరీష తదితర అధికారులంతా అదే ప్రాంతంపై దృష్టి సారించి గాలింపు బృందాలకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం మధ్యాహ్నం డయల్ 100కు కాల్ వచ్చింది. ఒక గుర్తుతెలియని వ్యక్తి పెంజర్ల సమీపంలో మృతి చెంది ఉన్నాడని సమాచారం రావడంతో అధికారులంతా వెంట వెంటనే అక్కడకు చేరుకున్నారు. నిందితుడు మృతి చెందడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
మృతుడి సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
కొత్తూరు, జూలై 13 : నరహంతకుడు రాజ్‌కుమార్ జూలై 10న తీసుకున్న సెల్ఫీ వీడి యో సంచలనంగా మారింది. ఈ విషయా న్ని ప్యూచర్‌సిటీ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. ‘బెట్టింగ్‌లతో తనకు రూ.2.5 కోట్ల వరకు అప్పులు అయ్యాయని.. ఒకవైపు అప్పులు.. మరోవైపు బాలిక పెట్టిన పోక్సో కేసుతో జీవితంపై విరక్తి చెందానని అం దులో రాజ్‌కుమార్ వివరించారు. నా తల్లిదండ్రుల మాటలు వినకుంటా ఉన్న రెండెకరాల భూమిని అమ్మి అందులో సగం వరకు ఆ బాధిత బాలిక కుటుంబానికే ఇచ్చా. అయినా వారు నన్ను జైలు పాలు చేయాలనుకున్నారు. అందుకే ఆ బాలికను ..ఆమె తల్లి, నాన్నమ్మను చంపాలని ఫిక్స్అయ్యా. భూమి మొత్తం పోవడంతో నా భార్య, ఇద్దరు పిల్లలు ఎలా బతుకుతారని వారిని కూడా చంపాలని నిర్ణయించుకున్నా. బాలిక పెట్టిన కేసుతో మానసికంగా చిత్రవధ అనుభవించా.’ అని తాను తీసుకున్న సెల్ఫీ వీడియోను సీపీ మీడియా ఎదుట ఉంచారు.