మన్సూరాబాద్, ఆగస్టు 3: అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగినందుకు మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, భరత్‌నగర్ ఫేజ్-2లో పత్తి నర్సమ్మ(50) వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. భద్రాచలం, సీతారంనగర్ కాలనీకి చెందిన సరోజ భర్త శ్రీరాంరెడ్డి, కుమారుడు శివారెడ్డితో కలిసి భరత్‌నగర్ కాలనీ ఫేజ్-2లో నివాసముంటుంది.
సరోజ కూలీ పని చేయగా ఆమె కుమారుడు శివారెడ్డి మేస్త్రి. అవసరాల నిమిత్తం పత్తి నర్సమ్మ వద్ద ఆరు నెలల క్రితం సరోజ రూ. 20 వేలు అప్పుగా తీసుకుని రూ. 4 వేలు చెల్లించింది. మిగతా రూ. 16 వేలు ఇవ్వాలని అడిగేందుకు శుక్రవారం సాయంత్రం సరోజ ఇంటికి నర్సమ్మ వచ్చింది. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. విషయాన్ని సరోజ తన కుమారుడు శివారెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది.
డబ్బులు ఇచ్చి తీరాలని ఒత్తిడి తేవడంతో సరోజ, శివారెడ్డి నర్సమ్మను సుత్తి, ఐరన్రాడుతో విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ఈ మధ్యనే ఖాళీ చేసిన ఓ గదిలోకి మార్చారు. ఇంట్లో పడిన రక్తపు మరకలను తూడ్చి కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నించారు. గొడవ విషయాన్ని శివారెడ్డి తన మిత్రుడైన రమేశ్‌కి తెలిపాడు. రమేశ్ ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నర్సమ్మ హత్యకు కారకులైన సరోజ ఆమె కుమారుడు శివారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.