సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: పట్టపగలు నగరం నడిబొడ్డున రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి,గొంతుకోసి పరారైన దుండగులు..పబ్లిక్ చూస్తుండగానే నాంపల్లి కోర్టుకు సమీపంలో హతుడిపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు..రోడ్డుపైనే పట్టపగలు హత్య జరిగినా పోలీసుల్లో చలనం లేదు. నిందితులు పారిపోతున్నా పట్టుకునే నాథుడే లేడు. దర్జాగా ముగ్గురు నిందితులు ఒకే వాహనంపై వెళ్తున్న సిసి ఫుటేజ్ చూసి వారిని పట్టుకోవడానికి పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. ఒకవైపు కోర్టు .. మరోవైపు పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరం.. అయినా నిందితుల్లో భయం లేదు. అదే సమయంలో పోలీసులకు పట్టింపు లేదు.
నాంపల్లి రోడ్డు మాదే. కానీ రోడ్డుపై చంపినవాళ్లు, చనిపోయిన వ్యక్తి మా పరిధిలోకి రారు. అసలు మేమక్కడ నిఘా ఎందుకు పెడతాం? మాదగ్గర ఎవరైనా అనుమానితులు ఉంటే వారిపై దృష్టిపెడతాం కానీ ఇలా వచ్చిపోయే ప్రతీ ఒక్కరిపైనా నిఘా ఎలా పెడతాం? అని పోలీసు ఉన్నతాధికారి వాదించారు. నాంపల్లిలో గురువారం ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన సమీపంలో పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన హత్య అటు స్థానికులతో పాటు ఇటు పోలీసుల్లోనూ కలవరం లేపింది.
కూతవేటు దూరంలోనే పోలీస్‌స్టేషన్ ఉన్నా ఆ భయమేమీ లేకుండానే నిందితులు దర్జాగా వచ్చి అంతమంది జనం మధ్యే కత్తులతో పొడిచి వెళ్లిపోవడాన్ని నగర జనాన్ని ముక్కునే వేలేసుకునేలా చేసింది. అటు పగలు గస్తీ పూర్తిగా లోపించడంతో పాటు ఇటు హత్యోదంతానికి నిఘా లోపం కూడా కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయాన్ ఖురేషి అనే వ్యక్తి జువైనల్ కోర్టుకి వాయిదా ఉండడంతో నాంపల్లికి వెళ్లి వస్తుండగా అతనిని అనుసరించిన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా అతనిపై బ్యాట్లు, కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత గొంతుకోసి దారుణంగా హత్య చేశారు.
మేమెలా నిఘా పెడతాం
అయితే ఈ కేసులో ఘటనాస్థలమైన నాంపల్లి రోడ్డు మాత్రమే తమ పరిధిలోకి వస్తుందని, ఇతర జోన్‌కు చెందిన నిందితులపై నిఘా పెట్టడం తమ బాధ్యత కాదని పోలీసు ఉన్నతాధికారులు వాదిస్తున్నారు.
నిందితులు ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తారో వారిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందని చెబుతున్నారు. కాగా ఈ హత్యకు సంబంధించి కొంత పురోగతి సాధించామని నాంపల్లి పోలీసులు వెల్లడించారు. కాగా నడిరోడ్డుపై హత్య జరిగితే వందలాదిమంది జనం చూస్తున్నప్పటికీ నిందితులు మర్డర్ చేసి ముగ్గురు ఒకే వాహనంపై అంతరద్దీలో దర్జాగా పారిపోయారంటే అది పోలీసుల వైఫ్యలమేనని ప్రత్యక్ష సాక్షులు విమర్శిస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు..!
మృతుడు అయాన్ బాలుడి(మైనర్)గా ఉన్న సమయంలోనే గతంలోనే ఒక హత్యలో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులోనే నిలోఫర్ కేఫ్ సమీపంలోని జువైనల్ కోర్టుకు తరచూ హాజరవుతూ ఉంటాడు. గురువారం కూడా నీలోఫర్‌లో చాయ్ తాగుదామని బండి ఆపుతుండగానే అతడిని అనుసరిస్తూ వచ్చిన ముగ్గురు వ్యక్తులు దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య కేసులో సీసీ కెమరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని అయాన్ కుటుంబసభ్యులు ఆరోపించారు. 2020లో కంచన్‌బాగ్‌లో జరిగిన ఓ హత్యకేసులో అయాన్‌తో పాటు అతని తండ్రి నిందితులుగా ఉన్నారు. ఈ హత్యకు ప్రతీకారంగానే అయాన్ ఖురేషిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.