చర్లపల్లి, ఆక్టోబర్ 16: ఓ మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం కటింగ్ కాలనీలో నివాసముండే లలిత(56) కృష్ణానగర్ కాలనీలో నివాసముండే తన సోదరి కుమారుడు టైలర్ శంకర్ ఇంటికి వచ్చింది. అయితే చక్రీపురం రెడ్డి కాలనీలోని టైలర్ షాపునకు వెళ్లి వస్తామని శంకర్, అతడి భార్య ఇందిర, శంకర్ చిన్న కుమారుడు లలితకు చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వచ్చే సరికి లలిత రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా కుషాయిగూడ సీఐ మన్మోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పలు ఆధారాలు సేకరించారు. శంకర్ కుమారుడు అర్జున్(26)కొంతకాలంగా మానస్థిక సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటూ ఇటీవలే ఇంటికి వచ్చాడు. అయితే మానసిక రుగ్మతతో మితిమీరి ప్రవరిస్తున్న తన కుమారుడే హత్య చేసి ఉంటాడని టైలర్ శంకర్ పోలీసులకు తెలుపగా.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.