చాంద్రాయణగుట్ట, ఆగస్టు 29: పాతబస్తీలో అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్లో ఉండే ఉమాకాంత్ (33) మొదట్లో లలితాబాగ్‌లో నివసించేవాడు. 2017లో మెదక్ కౌడిపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. మూడు నెలల కిందట ఉమాకాంత్ పాతబస్తీలో ఇల్లు ఖాళీ చేసి..మీర్‌పేట్‌కు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోయేవాడు. 28న రాత్రి అరుంధతి కాలనీ రాజీవ్‌గాంధీనగర్‌లో నివసించే స్నేహితుడు రవి ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి మందు తాగారు. ఏం జరిగిందో తెలియదు.. రవి కత్తెరతో ఉమకాంత్ కడుపులో పొడిచి తలుపులు పెట్టి వెళ్లిపోయాడు. 29న ఇంటి యజమానికి హత్య చేసిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్స్పెక్టర్లు సయ్యద్ ఖాదర్ జిలానీ, నవీన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని.. ఉమకాంత్ మృతదేహాన్ని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.