ఉప్పల్, ఆగస్టు 17: ఇంటికి పిలిచి మెడపై కత్తితో కోసి ఓ యువకుడిని హత్య చేశారు. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. నాచారం సీఐ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. భార్యాభర్తలైన మొయిన్‌ఖాన్, నేహాబేగంలు మల్లాపూర్ నాగలక్ష్మినగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. మొయిన్‌ఖాన్ సికింద్రాబాద్‌లో రోడ్డుపై బ్యాగులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. వీరు గతంలో వారసిగూడలో ఉన్నప్పుడు వీరి ఇంటికి సమీపంలో ఉండే సోహెల్(22)తో నేహాబేగానికి పరిచయం ఏర్పడింది. ఈ విషయం మొయిన్ఖాన్కు తెల్వడంతో మూడు నెలల క్రితం మల్లాపూర్నకు మకాం మార్చాడు. ఇది తెలుసుకున్న సోహెల్ మల్లాపూర్‌కు రావడం ప్రారంభించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో నేహాబేగం ఈ నెల 3న సోహెల్‌పై నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారం భార్యాభర్తలు మంగళవారం తెల్లవారు జామున సోహెల్‌ను మల్లాపూర్నకు రప్పించారు. ఇంటి పక్కనే ఉన్న ఖాళీ రూంలోకి తీసుకొని పోయి మెడపై కత్తితో కోసి హత్య చేసి పారిపోయారు. ఇంటి యజమాని చోటేదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.