జీడిమెట్ల, ఆగస్టు 10: ఓ వివాహితను స్నేహితుడితో కలిసి మాజీ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. జార్ఘండ్ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన పూజ(21)కు బిహార్‌కు చెందిన రాజేశ్వర్మతో 2021 ఏప్రిల్ వివాహం జరిగింది. అదే సంవత్సరం దంపతులిద్దరూ ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వినాయక్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. అయితే పూజకు వివాహం కాకముందు ధన్‌బాద్ ప్రాంతానికి చెందిన రాకేశ్‌ను ప్రేమించింది. నగరానికి వచ్చిన తర్వాత అతడితో రోజూ ఫోన్లో మాట్లాడేది. పూజ హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేశ్ స్నేహితుడితో కలిసి మంగళవారం జీడిమెట్లకు చేరుకున్నాడు.
అనంతరం పూజ నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్‌ను తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. పూజతో కొద్దిసేపు మాట్లాడిన రాకేశ్ తనతో ధన్‌బాద్ రావాలని బలవంతపెట్టాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఘర్షణకు దిగాడు. ఇది గమనించిన కింది పోర్షన్లో అద్దెకు ఉంటున్న రింకు అడ్డుకునేందుకు యత్నించగా కుమారుడిని చంపుతానని బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం రాకేశ్ అతడి స్నేహితుడితో కలిసి పూజను దిండుతో హత్య చేసి నగలను తీసుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూజ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పూజ భర్త రాజేశ్ వర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ బాలరాజు తెలిపారు.