సిటీబ్యూరో, అగస్టు 8(నమస్తే తెలంగాణ): రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. హత్యకు గల కారణం ఓ మహిళా భక్తురాలు అభిమానంతో త్రిలోక్నాథ్కు చెప్పిన మాటలే.. రియల్టర్ మర్డర్‌కు స్కెచ్ వేసేలా చేసినట్లు స్పష్టమవుతున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు.. త్రిలోక్‌నాథ్ అలియాస్ గురూజీ భక్తులు, మిత్రుల్లో విజయ్‌భాస్కర్‌రెడ్డి కూడా ఒకరు. వ్యాపారాలు, సేవల కోసం గురూజీ తనను రూ. 20 లక్షలు అడిగాడని ఓ మహిళ విజయ్‌భాస్కర్‌రెడ్డితో చెప్పింది. అతను స్పందిస్తూ.. ‘గురూజీ మోసగాడు. మీరు డబ్బులిస్తే తిరిగి రావు.. మోసపోతారు. అతడిని నమ్మొద్ద’ని చెప్పాడు. ఈ మాటలనే ఆ మహిళ గురూజీ వద్ద ప్రస్తావించడంతో అతడు కలవర పడ్డాడు. తన గురించి చెడుగా ప్రచారం చేస్తే.. ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించాడు. తనను ఎవరూ నమ్మరని.. ఆర్థికంగా దెబ్బ తింటామని, విజయ్‌భాస్కర్‌రెడ్డిని అంతమొందిస్తేనే సమస్యకు పరిష్కారమని గురూజీ భావించాడు. తన స్నేహితులను ప్రేరేపించి.. ఓ భారీ స్కెచ్ వేసి విజయ్‌భాస్కర్‌రెడ్డిని హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గురూజీ తన మొబైల్ ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ చేయడంతో పాటు తన స్థావరాల్లో ఎక్కడ ఉండకుండా కొత్త ప్రాంతానికి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మల్లేశం, కృష్ణంరాజు, ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్, సుధాకర్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే గురూజీ ఆ మహిళను రూ. 20 లక్షలు ఎందుకు అడిగాడు? ఎంత మందిని అడిగాడు? ఇలా వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అతడి మొబైల్ ఫోన్ నంబర్ల ద్వారా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి?. తరచుగా ఎవరితో మాట్లాడుతుంటాడు..? ఇలా ప్రతి అంశంపై విచారణ సాగిస్తామని సైబరాబాద్ పోలీసు అధికారులు వెల్లడించారు.