మెహిదీపట్నం ఆగస్టు 7: తాగుడుకు బానిసై శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన శనివారం సాయంత్రం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎం. నరేందర్‌లు తెలిపిన వివరాల ప్రకారం….మల్లేపల్లి అఫ్జల్‌సాగర్‌లో నివసించే రోషన్(34), లత దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, కొడుకు సంతానం. రోషన్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లతకు స్థానికంగా ఉండే యువరాజ్‌తో వివాహేతర సంబంధం ఉన్నది.
కాగా, తాగుడుకు బానిసగా మారిన రోషన్.. నిత్యం హింసిస్తుండటంతో భరించలేక శనివారం మధ్యాహ్నం లత కత్తితో పొడిచి పారిపోయింది. స్థానికులు రోషన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి హత్యకు గురికాగా, తల్లి కూడా పారిపోవడంతో వారి పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మెహిదీపట్నం ఆగస్టు 7: ఓ ట్రావెల్ ఏజెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…రాజేంద్రనగర్ హ్యాపీ హోమ్స్ ప్రాంతంలో నివసించే ఖాజీ నజీమోద్దీన్(47) మాసాబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ట్రావెల్స్ కార్యాలయం ఉంది. శనివారం రాత్రి కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని దుండగులు వచ్చి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమద్యలో ఖాజీ నజీమొద్దిన్ మృతి చెందాడు. మృతదేహాన్ని హుమాయూన్‌నగర్ పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.