పహాడీషరీఫ్, జూలై 20: డ్రైవర్‌ను తోటి డ్రైవరే హత్య చేసిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ అర్జునయ్య వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన మురిగేషన్ (37), మరో డ్రైవర్ కలిసి గ్లాసెస్ లోడ్ లారీతో తమిళనాడు నుంచి శ్రీరామకాలనీకి వస్తున్న క్రమంలో సోమవారం మధ్యాహ్నం గగన్‌పహాడ్ వద్ద లారీ బురదలో ఇరుక్కుపోయింది. విషయం తెలుసుకున్న గ్లాస్ షాపు యజమాని అరవింద్ కుమార్ జైన్ తన వద్ద పనిచేస్తున్న సూపర్వైజర్ మహ్మద్ మోసిన్‌కు ఫోన్ చేసి, ఇద్దరు డ్రైవర్లును కంపెనీ వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. మోసిన్ లారీ వద్దకు వెళ్లి.. వారిద్దరిని తీసుకుని కంపెనీ వద్దకు వచ్చాడు. అప్పటికే వారిద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఇద్దరు డ్రైవర్లు కొద్ది సేపటి తర్వాత ఏటీఎం వరకు వెళ్లి వస్తామని సూపర్వైజర్కు చెప్పి వెళ్లారు. తిరిగి రాకపోవడంతోపాటు ఫోన్‌చేసి మాట్లాడలేదు. కాగా, మంగళవారం ఉదయం శ్రీరామకాలనీ శివసాయి ఫర్నీచర్ షాపు వద్ద మురిగేషన్ తలకు తీవ్ర గాయలతో మృతిచెంది ఉన్నాడు. మరో డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు హత్యగా భావిస్తున్నారు. మోసిన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.