సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి-2026’ను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 44 లక్షల డబ్బాలు ఒక్కో డబ్బా 12 లీటర్ల సామర్థ్యంతో రెండు రకాల కలర్స్‌లో ఇంటింటికీ పంపిణీ చేసి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించారు.
ప్రస్తుతం అదే విధానాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తడిచెత్త , పొడిచెత్త, శానిటరీ వేస్ట్, ప్రత్యేక జాగ్రత్త అవసరమైన వ్యర్థాలు (స్పెషల్ కేర్ వేస్ట్) సేకరించాలంటూ పర్యవేక్షణ బాధ్యతల డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు, వ్యాపార సంస్థల వద్దే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయడం తప్పనిసరి. వీటితో పాటు తరచూ చెత్త కుప్పలు కనిపించే ప్రాంతాలను పూర్తిగా రూపుమాపేందుకు వార్డు స్థాయి కంటే కింద ‘నేబర్ హుడ్ / లోకాలిటీ’ స్థాయిలో ‘బీట్ సిస్టమ్’ను తీసుకురావాలని నిర్ణయించారు.