సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంపై గ్రేటర్ అధికారులతో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆరు గ్యారంటీ పథకాలను అందించేందుకు వార్డుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో షెడ్యూల్ సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వార్డులోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని, ఒక్కో ప్రాంతంలో మూడు కౌంటర్లను ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వివరించారు. అర్జిదారులు ఎక్కువగా ఉంటే అదనంగా మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 600 లోకేషన్లలో 5వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 5వేల మంది వలంటర్లతో ప్రజాపాలనకు సన్నాహాలు చేసినట్లుగా వివరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.