మేడ్చల్, సెప్టెంబర్28(నమస్తే తెలంగాణ): రోడ్ల నిర్వహణను మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. మరమ్మతులు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్న పట్టించుకునే వారే లేకుండా పోయారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లో ఇదే తీరు కొనసాగుతుంది. జిల్లాలో పీర్జాదిగూడ, బోడుప్పల్, నిజాంపేట్, జవహర్‌నగర్ కార్పొరేషన్లు కాగా మేడ్చల్, తూంకుంట, గుండ్లపోచంపల్లి, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్, ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి.
భారీ వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిని గుంతల మయంగా మారాయి. మరమ్మతులు చేపట్టాలని విన్నవించిన మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులకైనా మరమ్మతులు చేసి ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులకు ప్రణాళిక లేకుండా పోయింది. ప్రధాన రహదారుల, అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. వరదనీటిని కాలనీవాసులే తొలగించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
నిధులు లేవని..
రోడ్లకు మరమ్మతులు చేయడంలో నిధుల లేమీ కారణాన్ని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు అధికారులను కోరితే నిధులు లేవంటూ సమాధానం ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తైన ఇప్పటి వరకు మున్సిపాలిటీలకు నిధులు కేటాయించ లేదు. ప్రధానంగా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా వచ్చిన ఆదాయంతోనే మున్సిపాలిటీల నిర్వహణ కొనసాగిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం..
మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నాటి నుంచి మున్సిపాలిటీల నిర్వహణ మరింత అధ్వానంగా మారింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమస్యలు వస్తే పక్కన బెట్టి అధికారులకు డబ్బులు వచ్చే పనులను మాత్రమే చేస్తున్నారు. దీనికి తోడు అధికారులకు జవాబుదారి తనం లేకపోవడంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ఉన్నతాధికారులకు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడంతో మున్సిపాలిటీల తీరు అస్తవ్యస్తంగా మారింది.