Dana Kishore | హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడీమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరాతాబాద్తో పాటు నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం డైరెక్టర్‌తో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గాలులకు చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రూ.13 కోట్లతో సంపులు, నాళాలను నిర్మించాలని అధికారులకు ఆదేశాలిచారు. శేరిలింగంపల్లి నెక్టర్‌గార్డెన్ , ఖైరతాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో దాన కిశోర్ పర్యటించారు. వరద నీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి పరిధిలోని నెక్టర్ గార్డెన్ వద్ద వరద నీటి వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆరు కోట్ల 30 లక్షల లీటర్ల కెపాసిటీతో నీటి సంపును నిర్మించాలని, మరో రూ.7కోట్లతో నాళాలను నిర్మించాలని ఆదేశించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించి 45 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.