Gundlapochampally | మేడ్చల్, ఆగస్టు 26: అంగబలం, అర్ధ బలానికి, రాజకీయ ప్రాబల్యం తోడైతే అక్రమ వ్యాపారానికి అడ్డే ఉండదు. నిబంధనలను తోసిపుచ్చి, అనుమతుల అవసరం లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు. ఆపై వ్యాపారాలు చేసుకోవచ్చు. ‘ఆమ్యామ్యాలు అందితే.. అది అక్రమమైనా సక్రమమే..’ అన్న నానుడి గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అక్షరాలా రుజువు చేస్తున్నది.
అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంసీని స్థాపించి, కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న జనరిక్ మందుల ఆర్ అండ్ డీ ల్యాబ్‌ల నిర్వాహకులు అక్రమమని ఎంత మొత్తుకున్నా అరణ్య రోదనే అవుతుంది.. తప్పా అధికారులు కేవలం నోటీసులకే పరిమితం అయ్యారు. బీజేపీకి చెందిన ఎంపీ కుమారుడి అండదండలు ఉండటంతోనే సదరు ఆర్ఎంసీపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాస రేగడిలో కామాక్షి ఆర్ఎంసీ ఏర్పాటు చేసిన ప్రాంతానికి కేవలం 80 నుంచి 100 మీటర్ల దూరంలో జనరిక్ మందుల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. రెండు కంపెనీలు నాలుగైదేళ్ల నుంచి పని చేస్తుండగా మరో రెండు కేంద్రాలు పురోగతి దశలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం, ఆస్పత్రులకు 500 మీటర్ల దూరంలో ఇలాంటి కంపెనీలు ఉండాలి. మందుల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు కూడా అదే కోవకు చెందినవని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్ఎంసీ నుంచి వచ్చే దుమ్ముతో ల్యాబ్‌లో పరికరాలు సరిగా పని చేయకుండా ఫలితాలను తప్పుగా చూపే అవకాశం ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఎంసీని ఇక్కడి నుంచి తరలించాలని వారు అభ్యంతరం చెబుతున్నారు. హెచ్ఎండీఏ, సీఎంవో, మున్సిపాలిటీలకు ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ స్థానిక గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీకి చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైందని, ఎలాంటి చర్య తీసుకోవడంలేదని ఆర్ అండ్ డీ కేంద్రాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన నోటీసుపై ఆర్ఎంసీ మే 27న స్టే తెచ్చుకుంది. స్టేకు ఇచ్చిన నాలుగు వారాల సమయం పూర్తయిపోయినా చర్య తీసుకోకపోవడంతో మళ్లీ నిర్వాహకులు న్యాయస్థానానికి వెళ్లారు.
ఈ సారి పలుమార్లు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. జులై 31న జరిగిన వాదానల్లో మున్సిపాలిటీ జులై 30న నోటీసులు ఇచ్చామని, చర్యలు తీసుకుంటామని వివరించింది. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ రెడీమిక్స్ కంపెనీ మాత్రం నిర్మాణం పూర్తి చేసి, కార్యాకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తుంది. కమిషనర్‌ను పలుమార్లు ఈ విషయమై కలిశామని, చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని ఆర్ అండ్ డీల నిర్వాహకులు చెప్పారు. బాసరేగడిలో కామాక్షి ఆర్‌ఎంసీకి అనుమతులు లేవని ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయి. పరిశీలించి చర్యలు తీసుకుంటానని మున్సిపల్ కమిషనర్ స్వామి తెలిపారు.