సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సముదాయం కేటాయింపులోనే కాదు.. నిర్మాణ సమయంలోనూ అవకతవకల పుట్ట కదులుతుంది.. టెండర్ ప్రక్రియలో ఎన్నో మలపులు, మరెన్నో మడతలు ఉండగా.. ప్రాజెక్టు పూర్తి కాకముందే ధనార్జనే ధ్యేయంగా నవ నిర్మాణ అసోసియేట్ ప్రకటనల దందా తెరలేపింది.. టెండర్ నిబంధనల ప్రకారం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చాకనే సంబంధిత ప్రకటనల రూపంలో ఆదాయాన్ని ఆర్జించాలి..కానీ ఘనత వహించిన నవ నిర్మాణ్ అసోసియేట్స్ గడిచిన 10 రోజులుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా దందా చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికింది. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించిన సదరు నవ నిర్మాణ్ అసోసియేట్స్ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పూర్తి కాకముందే ప్రకటనలు ఎలా అనుమతికి ఇస్తావంటూ హెచ్చరికలు జారీ చేసింది.
అడ్డదారిలో టెండర్ దక్కించుకోవడమే కాదు …నిర్మాణ సమయంలోనూ నిబంధనలకు నవ నిర్మాణ్ అసోసియేట్ నీళ్లొదిలింది. టెండర్ల ప్రక్రియ నుంచి వర్క్ అర్డర్ పొందే వరకు తనదైన శైలిలో వ్యవహారాలను చక్కపెట్టిన సదరు ఏజెన్సీ ప్రాజెక్టు లక్ష్యానికి గండి కొట్టింది. వాస్తవంగా మల్టీ లెవల్ కారు పార్కింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి 72 కారు పార్కింగ్‌కు సౌకర్యం కల్పించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి…క్షేత్రస్థాయిలో పార్కింగ్ కోసం కాదు…వ్యాపార కోసమే ఈ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు సదరు ఏజెన్సీ వ్యవహరిస్తున్నది.
ప్రాజెక్టు పనులు పట్టుమని 30 శాతం కూడా పూర్తి కాకముందే ఆగమేఘాల మీద భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ప్రారంభించి ప్రకటనల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చాకనే నిబంధనల ప్రకారం ప్రకటనలు, గ్రౌండ్ లెవల్లో క్యాఫిటెరియా, కాంప్లెక్స్ ఆనుకుని ఎల్ఈడీ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసుకుని ఆదాయం వైపు అడుగులు వేయాలి. కానీ నిబంధనలకు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణం జరుగుతున్న సమయంలో ప్రాజెక్టుకు అడ్డంగా ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసుకుని మరీ దందా చేస్తుంటం గమనార్హం.
నిర్మాణ సమయంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది. టెండర్ నిబంధనల ప్రకారం 484 గజాల జాగాను మాత్రమే మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌కు జీహెచ్ఎంసీ కేటాయించింది. కానీ దాని వెనకాలే ఉన్న మరో 1000 గజాల స్థలాన్ని సదరు సంస్థ చేతిలోకి అనధికారికంగా తీసుకున్నది. కేబీఆర్ పార్కు చుట్టూ వాకర్లకు, సందర్శకులకు కోసం లూ కేఫ్ పేరుతో టాయిలెట్స్ ఉండే వాటిని తొలిగించారు. పార్కుకు సంబంధించిన గోడను కూల్చివేసి మరింత లోనికి జరుగుతూ కొత్తగా గోడ కట్టేయడం, మొత్తంగా మల్టీ లెవల్ కార్కు పార్కింగ్ ప్రాజెక్టును బిజినెస్ వెంచర్‌గా మార్చే కేంద్రంగా చేసుకోవడం విశేషం.
ప్రకటనలో విభాగంలో ఉండి..జీహెచ్ఎంసీకి రూ.110కోట్లకు పైగా టోకరా వేసిన వ్యక్తులు అడ్డదారిలో వస్తే పనులెట్ల అప్పగిస్తారని జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా నవ నిర్మాణ అసోసియేట్ అక్రమాలను సభ్యులు ఎండగట్టారు. గతంలో యాడ్ వేస్‌లో వ్యాపారం చేసిన వ్యక్తులే తిరిగి నవ నిర్మాణ్ అసోసియేట్‌గా పేరు మార్చుకుని వచ్చిన దొంగ కంపెనీకి ప్రాజెక్టును అప్పగించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. న్యాయ స్థానానికి వెళ్లి స్టే తెచ్చుకుంటే బకాయిలు కట్టించుకునే ప్రయత్నాలు చేయకపోవడం పట్ల అధికారుల తీరును తప్పుపట్టారు.
కౌన్సిల్ ప్రశ్నోర్థాల సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కేబీఆర్ పార్కు మల్టీ లెవల్ కారు పార్కింగ్ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు విషయంలో సదరు నవ నిర్మాణ్ అసోసియేట్‌కు జీవో 68 నిబంధనలు వర్తించవా?అని ప్రశ్నించారు. నవ నిర్మాణ్ అసోసియేట్‌పై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరగా…అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ స్పందించారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే ప్రకటనలు మొదలు పెట్టిన సదరు ఏజెన్సీకి నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు.