సిటీబ్యూరో, నవంబరు 28 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు వద్ద నిర్మించతలపెట్టిన మల్టీలెవల్ స్మార్ట్ కారు పార్కింగ్ ఎట్టకేలకు అందుబాటులోకి వస్తున్నది. 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నవ నిర్మాణ్ అసోసియేట్ సంస్థ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించింది. 72 ఈక్వివలెంట్ కారు స్పేసెస్తో పాటు పార్కింగ్ విస్తీర్ణంలో 20 శాతాన్ని ద్విచక్ర వాహనాల కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్టును నవ నిర్మాణ్ అసోసియేట్స్ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పీపీపీ మోడల్లో నిర్మించి ఆమలు చేస్తున్నది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పార్కు చేసుకునే వీలు ఉంటుంది. ఈ మేరకు శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ మల్టీలెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ విదానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. దీంతో కేబీఆర్ పార్కు పరిసరాల్లో పెరుగుతున్న రోడ్ సైడ్ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను నిలిపే వీలుండడంతోపాటు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, పాదచారుల భద్రతకు ఇది తోడ్పడనుంది.
కాంపాక్ట్ డిజైన్ :నిలువు రోటరీ సిస్టమ్ ద్వారా భూమి వినియోగం తగ్గింపు
పార్కింగ్ సామర్థ్యం:72 కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక స్థలాలు
స్మార్ట్ యాక్సెస్:ఆర్ఎఫ్ఐడీ అధారిత ప్రవేశం-ఎగ్జిట్
ఈవీ ఛార్జింగ్:గ్రీన్ మొబిలిటీకి తోడ్పాటు
స్మార్ట్ భద్రత:సెన్సర్లు, లాకింగ్ వ్యవస్థలు, సీసీటీవీ పర్యవేక్షణ