సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): త్యాగాలను గుర్తు చేస్తూ బుధవారం మొహర్రం సందర్భంగా పాత నగరంలో నిర్వహించిన ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏర్పాట్లను పరిశీలించి మొహర్రం సందర్భంగా దట్టీని సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేశారని, స్వయంగా ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించి దట్టీ సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. త్యాగాలను గుర్తు చేస్తూ పవిత్రంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని, ఈ సందర్భంగా తాను కూడా దట్టీని సమర్పించానన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ 2500 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ర్యాలీ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తుంటానని సీపీ మీడియాతో తెలిపారు. సీపీతోపాటు అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.