హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): నగరంలోని ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలను వచ్చే ఆరు నెలల్లోగా రాకంచర్ల స్టీల్ ఇండస్ట్రీయల్ పార్కుకు తరలించకుంటే వారికి కేటాయించిన భూములను రద్దుచేస్తామని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు. సోమవారం బాలమల్లుతోపాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితోపాటు టీఎస్ఐఐసీ అధికారులు రాకంచర్లలోని స్టీల్ పార్కును సందర్శించి పరిశ్రమల కోసం ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న స్టీల్ పరిశ్రమల యజమానులతో మాట్లాడి వారికేమైనా ఇబ్బందులున్నాయా అని తెలుసుకున్నారు. అనంతరం బాలమల్లు మాట్లాడుతూ రాకంచర్ల పారిశ్రామికవాడలో పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు, నాలుగు కొత్త ఐరన్ ఫ్యాక్టరీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయని చెప్పారు.
కాటేదాన్‌లోని 20ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలకు రాకంచర్ల పారిశ్రామికవాడలో స్థలాలు కేటాయించినా వారినుంచి స్పందన రావడంలేదన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నోటీసులు అందుకున్న పరిశ్రమల యజమానులంతా వెంటనే తమ పరిశ్రమలను రాకంచర్లకు తరలించాలని విజ్ఞప్తిచేశారు. ఆరు నెలల్లోగా తరలించకుంటే రాకంచర్ల ఇండస్ట్రీయల్ పార్కును జనరల్ కేటగిరీ కింద మార్చి అక్కడ ఇతర పరిశ్రమలకు అవకాశం కలిస్తామన్నారు.
రాకంచర్ల స్టీల్ పార్కును జనరల్ పార్కుగా మార్చి స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్ రెడ్డిసహా స్థానిక ప్రజాప్రతినిధులు బాలమల్లు, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని కోరారు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులకు మెరుగైన ఉద్యోగ, ఉపాథి అవకాశాలు లభించే అవకాశముందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు.