సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వీపింగ్ మెషీన్ల వినియోగాన్ని నిలిపివేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారుతోంది. కమిషనర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్‌రెడ్డి, బల్దియా కమిషనర్‌కు ఘాటు లేఖ రాశారు. నిధులు లేవని స్వీపింగ్ పనులు ఆపేస్తారా? స్వచ్ఛ హైదరాబాద్‌కు తూట్లు పొడుస్తారా? కాలుష్యంగా మారిన ఢిల్లీలా మార్చుతారా? అంటూ అసద్ మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా వెంటనే స్వీపింగ్ మెషీన్లను వినియోగంలోకి తీసుకురావాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎంపీ లేఖతో గ్రేటర్ పారిశుద్ధ్య నిర్వహణ లోపాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో 1,161 కిలోమీటర్ల మేరలో ఉన్న కమర్షియల్ (సీఆర్ఎంపీ/నాన్ సీఆర్ఎంపీ) రోడ్లలో దుమ్ము, చెత్త చెదారం, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఎత్తివేసి రహదారులను శుభ్రంగా ఉంచే చర్యల్లో భాగంగా 38 స్వీపింగ్ మెషీన్లను వినియోగిస్తూ వచ్చారు. సర్కిల్‌కు ఒకటి చొప్పున అద్దె ప్రాతిపదికన ఎజెన్సీలకు ఒక్కో వాహనానికి ఏడాదికి రూ.కోటి 13 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా వీటి కోసం రూ.20కోట్లకు పైగా ఖర్చు మిగతా చేస్తున్నారు. ఈ స్వీపింగ్ యంత్రాలతో ఒక్కో మెషీన్ 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు అర్థరాత్రి, తెల్లవారుజామున క్లీనింగ్ ప్రక్రియ జరుపుతున్నారు. ఐతే అద్దె ప్రాతిపదికన జరుపుతున్న స్వీపింగ్ యంత్రాల టెండర్ గడువు జూన్ చివరి వారంలో ముగిసింది. రెన్యూవల్ చేయకపోవడం, కొత్తగా టెండర్లు పిలిచే ప్రయత్నం చేయలేదు. నిధులు లేవన్న కారణంగా కమిషనర్ నిర్ణయం తీసుకోకపోవడం, ఈ స్వీపింగ్ మెషీన్ల స్థానంలో కార్మికులతో పనిచేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వచ్ఛ హైదరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకం. ప్రధాన రహదారులు మినహా కాలనీలు, బస్తీలు పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతున్నారు. శానిటేషన్ విభాగంలో అన్ని కేటగిరిలు కలిపి 22,019 మంది పనిచేస్తున్నారు. ఇందులో18343 మంది వర్కర్లు ఉండగా, ఇతర పీహెచ్ వర్కర్స్ 2,365, ఎస్ఎఫ్ఏలు 952, ఫీల్డ్ ఆఫీసర్స్ (డీఈఈ/ఏఎంఓహెచ్) 29, ఎన్వీరాన్‌మెంటల్ స్పెషలిస్ట్స్ 30 మంది పనిచేస్తున్నారు. ఐతే శరవేగంగా విస్తరిస్తున్న గ్రేటర్లో కాలనీల పరిధులు పెరిగినప్పటికీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. పైగా విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య బారినపడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గ్రేటర్‌ను అందంగా ముస్తాబు చేసే కార్మికులు అహర్నిశలు కష్టపడుతుంటే కొందరి అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా పనిభారం అదనంగా మోపుతూ అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేస్తున్నారు. తాజాగా స్వీపింగ్ మెషీన్లను బంద్ చేయడంతో పాటు అవి చేసే పని కూడా కార్మికులతో చేయిస్తున్న బల్దియా అధికారుల తీరుపై కార్మిక సంఘాల నేతలు కూడా గుర్రుమీద ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా స్వీపింగ్ మెషీన్ల సేవలను రెన్యూవల్ చేయవద్దనే బల్దియా కమిషనర్ నిర్ణయాన్ని ఎంపీ అసద్ వ్యతిరేకించడంతో పాటు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.