బండ్లగూడ, మార్చి 20: హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై పెను ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఓ కారులో మంటలు (Car Catches Fire) చేరేగాయి. క్రమంగా అవి కారు మొత్తానికి వ్యాపించడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని వెల్లడించారు. డ్రైవర్ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.