సిటీబ్యూరో: రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు తప్ప.. ఒక్క ఇటుక పేర్చింది లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మండిపడ్డారు. నార్త్ సిటీ అభివృద్ధిలో కీలకమైన జాతీయ రహదారి ఫ్లైఓవర్, మెట్రో నిర్మాణ ప్రాజెక్టుల స్థితిగతులపై మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. సోమవారం కొంపల్లిలో జరిగిన ఈ సమావేశంలో.. నగరవాసులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. వాటిని అమలు చేయడంలో పూర్తి విఫలమైందన్నారు.
ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత దాని పురోగతి పూర్తిగా నిలిచిపోయిందని, అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి చేపట్టే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టు అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. నార్త్ సిటీ మెట్రో సాధన విషయంలో మరో ఉద్యమానికి సన్నాహాలు చేస్తామన్నారు. తక్షణమే నార్త్ సిటీ మెట్రో విషయంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.