దువ్వెనలకు ఆశల దారం కట్టి
ముంజెలని దొర్లే బండి చేసి బాల్యం
ఆకుపచ్చని నేలను తనువు అంతా పరుచుకుని
ఆకాశంలో కదిలే నీలిచిత్రాలను ఆస్వాదించేది
బ్యాగులు బెంచీలు ఏమార్చి
నోట్బుక్లో కమ్మలు తస్కరించి
బడి ఒడిలో కౌమారం కొంటె పనులెన్నో
దోస్తులను ఆట పట్టించి అటెంక అల్లుకుపోయి
లంగా వోణి చుట్టూ భ్రమించిన యౌవనం
ప్రేమగా మత్తులోకి గమ్మత్తులోకి జీవితం
కష్టాల కఠిన పయనంలో తీపి జ్ఞాపకం
అనుభూతి స్వర్గం ఆనంద మజిలీ కాలేజీ
మార్కులకు పట్టం కట్టని రోజులు
హాజరు ఒకటి పలికి గేటు దూకిన దోస్తీ
మార్నింగ్ షోలో మొత్తం సిలబస్ మటాష్
పరీక్షల ముందు మాత్రం స్నేహితులతో నైటవుట్లు
పట్నం వాకిట్లో బ్యాచిలర్ పాట్లు
షేరింగ్ కేరింగ్లు నేర్పించి నిలిపాయి
గోడ నిండా వెలిసిన సినీప్రియురాళ్లు
ఉపవాసాలను మరిపించాయి ఏళ్ల తరబడి
బంధాలు ముడిపడి బాధ్యతల ముళ్లపొదల్లోకి
బతుకు ఏడనో కాట గలిసినట్లు అయిపాయె
ఒంటరిగా మిగిలి ఓదార్పు ఒకటి ఉందంటే
గుర్తుల గుమ్మిని కదిపినప్పుడు మాత్రమే సుమీ…