సంగారెడ్డి, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్‌ను నిరాశలోకి నెట్టింది. సీఎం జిల్లా అభివృద్ధికి నిధులు ఇచ్చి, వరాలు కురిపించి ప్రజల్లో తమ పరువు, పరపతి పెంచుతాడని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భావించారు. కానీ, వారు అనుకున్నది ఒకటైతే సీఎం సంగారెడ్డి పర్యటనతో మరోటి అయ్యింది. శనివారం సంగారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా ప్రజలకు ఎలాంటి వరాలు ఇవ్వలేదు, అభివృద్ధ్దికి పైసా నిధులు కేటాయిస్తామని చెప్పలేదు, కొత్త ప్రాజెక్టులపై ప్రకటనలు చేయలేదు. జిల్లా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపైనా మాట్లాడలేదు.
సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరణ, కొత్తరోడ్లకు నిధులు, సాగు, తాగునీటి సరఫరాకు నిధులు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి రేవంత్‌రెడ్డి నిధులు ఇస్తారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు ఆశపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీ సాకుగా పెట్టుకుని సంగారెడ్డి వేదికగా బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని దూషణలకు దిగారు తప్ప జిల్లాకు రూపాయి ఇవ్వలేదు. సీఎం తీరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. జహీరాబాద్ పర్యటనలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు ఎలాంటి వరాలు ఇవ్వలేదు.
తాజాగా సంగారెడ్డి పర్యటనలో సైతం నిధులు ప్రకటించకపోటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిధులు కేటాయిస్తే ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరేదని, నిధులు ఇవ్వకుండా సీఎం కాంగ్రెస్ ఆశలకు గండికొట్టారని కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటకు వచ్చి జిల్లా మంత్రి దామోదర, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అవమానించారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహా తన నియోజకవర్గంలోని సింగూరు ప్రాజెక్టును టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయాలని మూడుసార్లు సీఎంను కోరినా, సీఎం ఎలాంటి ప్రకటన చేయకుండా సీనియర్ మంత్రి దామోదరను అవమానించారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
జగ్గారెడ్డిని సైతం సీఎం అవమానించారని ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్‌రెడ్డి సంగారెడ్డి పర్యటనలో తన భార్య నిర్మలారెడ్డి టీజీఐఐసీ చైర్మన్ పదవి రెన్యువల్‌పై ప్రకటన చేస్తారని ఆశించారు. సీఎం ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల నిరాశకు గురయ్యారు. సీఎం తన ప్రసంగం ముగింపులో జగ్గారెడ్డిని అవమానించే రీతిలో మాట్లాడారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగ్గారెడ్డి పిచ్చోడు.. సిగ్గులేనోడు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటంపైనా జగ్గారెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.