శంషాబాద్ రూరల్, మార్చి 13 : ఆస్తికోసం తల్లిని కొడుకు చంపేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రాళ్లగూడ రాఘవేంద్రకాలనీలో నివాసముంటున్న రాచమల్ల చంద్రకళ(55) ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తుంది.
పెద్దకొడుకు రాచమల్ల ప్రకాశ్(38)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతకొంత కాలం నుంచి రాఘవేంద్రకాలనీలో ఉన్న 100 గజాల ఇంటిని ఇద్దరు అన్నదమ్ములకు పంచి ఇవ్వాలని ప్రకాశ్ తల్లిని తరచూ వేధిపులకు గురి చేస్తున్నాడు. బుధవారం రాత్రి సమయంలో మద్యం మత్తులో తల్లితో గొడవపడి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను తలపై వేయడం, కట్టెలతో తలపై బాదడంతో తీవ్ర గాయాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రకాశ్‌ను పోలీసులు ఆదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వెంగళరావునగర్, మార్చి 13: భార్యాబిడ్డలుండగా తనకింకా పెండ్లి కాలేదని మరో యువతికి దగ్గరై మాయమాటలతో ఆమెని లోబర్చుకున్నాడు. శారీరకంగా యువతిని వాడుకుని మోజు తీరాక తనకు పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజం బయటపెట్టాడు. పెండ్లి చేసుకోమని చెప్పడంతో దాడి చేసి పారిపోయిన సంఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాపునగర్ లో నివాసముండే శ్యామ్ లాల్ (30) బోటిక్ షాపు నిర్వహిస్తుంటాడు.
మధురానగర్ లో మూడేండ్ల క్రితం ఓ యువతితో పరిచయం ఏర్పడింది. శ్యామ్ లాల్ కు పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టి.. తనకు పెళ్లి కాలేదని ఆమెతో అబద్ధం చెప్పాడు. ప్రేమించానని..పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెండ్లి విషయమై ప్రియుడిని నిలదీయండంతో ఆమెని కొట్టి వెళ్లిపోయాడు. బాధిత యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.