తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 14: అనారోగ్య సమస్యలతో పుట్టిన ఓ శిశువు భారంగా భావించిన ఓ తల్లి మాతృత్వాన్ని మరిచి రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లిపోయి మానవత్వాన్ని మంటగలిపింది. రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో పాపకు ప్రాణాపాయం తప్పింది. ఈ హృదయ విదారక ఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని లకిడికపూల్ రైల్వేస్టేషన్ పక్కన వెలుగుచూసింది.
సుమారు 10రోజుల వయసున్న ఆడ పసికందును సోమవారం సాయంత్రం ఓ తల్లి వదిలి వెళ్లిపోయింది. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆడ శిశువును గమనించిన ప్రయాణికులు డిప్యూటీ స్టేషన్ మాస్టర్‌కు, బందోబస్తును పర్యవేక్షిస్తున్న నాంపల్లి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాగా రైల్వే పోలీసులు పాపను పరిశీలించి వెంటనే చికిత్స నిమిత్తం నీలోఫర్ దవఖానకు తరలించారు.
వెన్నుపూస వెనుక భాగంలో పాపకు ఒక ట్యూమర్ ఉందని గుర్తించిన వైద్యులు ప్రాణాపాయం ఉందని తేల్చి చెప్పారు. కాగా అనారోగ్య సమస్యలతో పుట్టిన పాపకు వైద్యం అందించలేక స్టేషన్లో వదిలి వెళ్లారా? లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కేసు నమోదు చేసుకుని నాంపల్లి రైల్వే పోలీసులు దర్యాపు చేస్తున్నారు. నీలోఫర్ దవఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి బాధ్యతలు శిశువిహార్‌కు అప్పగించినట్లు రైల్వే పోలీస్‌స్టేషన్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.