Rains | హైదరాబాద్ : తెలంగాణకు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.
గురువారం మధ్యాహ్నం సమయంలో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇవాళ రాత్రికి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరవాసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపు కూడా హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో కూడా చిరుజల్లలు కురిసే అవకాశం ఉంది. నిన్న సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో రాత్రంతా వాన పడింది. ఈ జిల్లాల్లో 170 నుంచి 180 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది.