సిటీబ్యూరో, మే 17, (నమస్తే తెలంగాణ) : రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ఈ మేరకు జూన్ నుంచి అక్టోబర్ వరకు మాన్సూన్ యాక్షన్‌ప్లాన్ రూపకల్పనకు సిద్ధమైంది.స్టాటిక్ లేబర్ టీంలు, మినీ మొబైల్ టీమ్‌లు, వాహనాలు, మొబైల్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటులో భాగంగా సర్కిళ్ల వారీగా టెండర్లను ఆహ్వానించి..
సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా తరహా ఈ ఏడాది కూడా రూ. 36.98 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌తో బల్దియా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నది. అయితే, వర్షాకాలం వచ్చే ముందే నాలాల పూడిక తీత పనులను ఇప్పటికే తుది దశకు చేర్చాల్సిన అధికారులు.. ఆ దిశగా పనుల్లో వేగం పెంచలేదు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 166 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను రంగంలోకి దింపనున్నారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి. మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీంలలో షిప్టు వారీగా ప్రతి బృందంలో నలుగురు కార్మికులు ఉంటారు. దీంతో పాటు ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్ (పర్యవేక్షకులు)గా నియమించనున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద అంచనా బట్టి దిగువకు చెరువు నీటిని విడుదల చేయడం, ఎప్పటికప్పుడు చెరువుల వరదపై అప్రమత్తంగా ఉండటం వంటి చర్యలు చేపడతారు. ఎన్ఎన్డీపీ పనులు జరిగే స్థలాల్లో ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా బ్యారికేడ్ల ఏర్పాట్లు, రోడ్లు మూసివేత, హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లపై దృష్టి సారిస్తారు. ప్రాజెక్టు విభాగానికి సంబంధించి 18 మంది అధికారులను నియమించనున్నారు.
జీహెచ్ఎంసీతో అమీతుమీ తేల్చుకునేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. ఏడాది కాలంలో అప్పుల ఊబిలో చిక్కుకుని, ఆర్థిక సమస్యలతో ప్రాణాలు పోతున్నా.. జీహెచ్ఎంసీ లెక్క చేయడం లేదని, రూ. 1350 కోట్ల బకాయిలు చెల్లించే వరకు ప్రస్తుతం చేపడుతున్న పనులతో పాటు కొత్తగా చేపట్టబోయే పనులకు దూరంగా ఉంటామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు నేటి నుంచి కాంట్రాక్టర్లంతా మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లంతా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం అత్యవసర సమావేశమై కార్యాచరణను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.