ఎన్నికల నేపథ్యంలో నగరంలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ చుట్టూ ఉన్న హైదరాబాద్‌లోకి ప్రవేశించే మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, నగరం నుంచి వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదు, నగలు, ఇతరత్రా వస్తువులను పట్టుకుంటున్నారు. సీజ్ చేసిన నగదు, ఆభరణాలు, ఇతరత్రా వస్తువులకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించని సొత్తును సీజ్ చేసి, సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని పోలీసు, ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీనియర్ పోలీసు అధికారుల ప్రజలను కోరారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ): శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్కాడ్ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. భారీ స్థాయిలో నగదు, అక్రమ మద్యం పట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా శుక్రవారం పోలీసు అథారిటీ ద్వారా రూ.2.56 కోట్ల నగదు సీజ్ చేశారు. ఇప్పటి వరకు రూ.42.28 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. 28 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 1609 మంది బైండోవర్, 1084 నక్కాస్ ఆపరేషన్స్, 715 నాన్ బెయిలబుల్ వారంట్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 2,129 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్టు వివరించారు.
మెహిదీపట్నం: కార్లలో డబ్బులు తరలిస్తున్న సోదరులను ఆసిఫ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.78 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. షేక్‌పేట గుల్షన్ కాలనీకి చెందిన మహ్మద్ షహనవాజ్ఉద్దీన్(43), మహ్మద్ షాబుద్దీన్(40) సోదరులు. వీరిద్దరూ ఇటీవలే సౌదీ నుంచి వచ్చారు. వీరిద్దరూ గురువారం రాత్రి రెండు కార్లలో ఆసిఫ్‌నగర్ నుంచి గుడిమల్కాపూర్ వెళ్తున్నారు. గుడిమల్కాపూర్‌లోని సాయిబాబా ఆలయం సమీపంలో వీరి కార్లను పోలీసులు తనిఖీ చేయ గా.. బ్యాగుల్లో డబ్బులు కనిపించాయి. డబ్బుల గురించి ఆరా తీయగా.. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులు ఆ నగదు బ్యాగులను సీజ్ చేశారు. శుక్రవారం ఈ నగదును ఐటీ ఆధికారులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
కార్వాన్: గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1,02,400 స్వాధీనం చేసుకున్నారు.నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపలేదని, దీంతో ఆ నగదు సీజ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ తెలిపారు.
కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పోలీసులు దూలపల్లి చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల 50 వేల నగదు పట్టుబడింది. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగించారు.
బడంగ్‌పేట: బాలాపూర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో తరలిస్తున్న రూ.1,05,000 నగదును సీజ్ చేశారు. ఈ నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపలేదని, దీంతో సీజ్ చేశామని ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.
జియాగూడ: కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ దేవాలయం వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మేకల మండి వ్యాపారి రాజ్‌గోపాల్ ద్విచక్రవాహనంపై రూ.ఐదు లక్షలు తరలిస్తుండగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు .
జూబ్లీహిల్స్: సైఫాబాద్ పీఎస్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారుడైన రాపోల్ నరేశ్ వద్ద రూ.19.80 లక్షల నగదును పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నారు.