Hyderabad | మొయినాబాద్, ఫిబ్రవరి15: రోడ్డు పక్కన టీ స్టాల్.. అక్కడ టీ తాగడానికి రోజుకు వందల మంది వస్తుంటారు.. కానీ దానికి తగ్గట్టు పార్కింగ్ లేదు.. దీంతో రోడ్డుపైనే వాహనాలను ఇష్టమొచ్చినట్లు పెట్టేసి వెళ్తున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఫైన్లు వేసేందుకు ఫొటోలు కొట్టుకుని వెళ్లిపోతున్నారు… కానీ అక్కడ ఏర్పడ్డ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంపై శ్రద్ధ పెట్టడం లేదు. మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఫొటోలు కొట్టడమేనా.. ట్రాఫిక్‌ను నియంత్రించేది ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
మొయినాబాద్ మండల కేంద్రంలోని మజీద్‌కు ఎదురుగా ఉన్న కబ్రాస్థాన్ గోడ బయట హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిని ఆనుకుని తందూరీ చాయ్ పేరుతో టీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. టీ స్టాల్ ముందు నుంచి రహదారి రెండు లేన్లు ఉంటుంది. కానీ టీ స్టాల్‌కు వచ్చిన వారు టీ తాగాలి అంటే తమ వాహనాలను పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్థలం అసలే లేదు. దీంతో టీ తాగడానికి వచ్చిన వాహనదారులు తమ వాహనాలను ఒక లేన్‌లో పార్కింగ్ చేసి టీ తాగుతున్నారు. రహదారిపై వాహనాలను పార్కింగ్ చేయడంతో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఒకే లేన్‌లో పోవాల్సి వస్తుంది. అంతే కాకుండా టీ స్టాల్ ముందే యూ టర్న్ ఉంది. రహదారి మీద వాహనాలను పార్కింగ్ చేయడంతో పెద్ద వాహనాలు యూటర్న్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. అదే విధంగా టీ స్టాల్ పక్క నుంచే మొయినాబాద్ గ్రామంలోనికి వెళ్లడానికి రోడ్డు ఉంటుంది. గ్రామంలోనికి వెళ్లే వాహనదారులు ఎడమ వైపు మళ్లే దారికి అడ్డంగా వాహనాలను పెట్టడంతో కుడి వైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎదురుగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కుడివైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎదురుగా వెళ్తే అక్కడ కూడ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. టీ స్టాల్ ముందే యూటర్న్ ఉండటం వలన వాహనాలను తిప్పడం .. టీ స్టాల్ పక్క నుంచే ఉన్న రోడ్డులో ఎడమ వైపునకు వాహనాలను మలపాల్సిన ఉండటం వలన టీ స్టాల్ ముందు ఉన్న రహదారిపై వాహనాలను పార్కింగ్ చేయడంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఛలాన్ల మీద ఉన్న శ్రద్ధ.. ట్రాఫిక్ నియంత్రణపై లేదు..
ట్రాఫిక్ పోలీసులకు వాహనాలకు ఛలనా విధంచడం పట్ల ఉన్న శ్రద్ధ మున్సిపల్ కేంద్రంలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పగటి పూట కొద్దిసేపు విధులు నిర్వహించి ఏ మాత్రం కొద్దిగా రోడ్డు మీద వాహనం పార్కింగ్ చేసినా, రోడ్డు పక్కన పార్కింగ్ చేసినా, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా వారి వాహనాలకు ఛలాన్లు విధించడం మంచి పని అయినా కానీ అదే శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణపై కూడా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. సాయంత్రం వరకు మాత్రమే విధులు నిర్వహించి పని అయిపోయిందని అనుకుని వెళ్లిపోతే.. రాత్రి 9 గంటల వరకు నిలిచిపోయే ట్రాఫిక్‌ను ఎవరు నియంత్రిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రాత్రి సమయంలో కేంద్రంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరగడంతో మున్సిపల్ కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. ముందే ఈ రహదారిపై ప్రముఖుల రాకపోకలు సాగుతుంటాయి. కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వలన వాళ్ల రాకపోకలకు ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. వ్యాపార దుకాణాల సమూదాయాల ముందు రహదారరిపై ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.