మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో నగర వ్యాప్తంగా భద్రతా బలగాలు మోహరిస్తాయి. రెవెన్యూ, పౌర సరఫరాలు, జీహెచ్ఎంసీ ఇతర స్థానిక సంస్థల అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంటారు. సురక్షిత ప్రాంతాలు, సెల్లార్లు, బంకర్లకు తరలించేందుకు రవాణాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటారు. ఆయా ప్రాంతాల్లో వీధి దీపాలు, భవనాల్లోని లైట్లు, ప్రకటనల లైట్లను ఆపేస్తారు. మాక్ డ్రిల్ సమయం కాగానే ఇండస్ట్రియల్ సైరన్లు, ప్రధాన కూడళ్లలో పోలీసు మైకులు, ఫైర్ సైరన్లు వినిపిస్తాయి. ఇదంతా వేగంగా పకడ్బందీగా జరుగుతుంది. ప్రతి అంశాన్ని పోలీసు బలగాలు కండ్లకు కట్టినట్లు చూపిస్తారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఏవిధంగా స్పందించాలో, భద్రతా బలగాలకు ఎలా సహకరించాలో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తారు. ఎంపిక చేసిన ప్రదేశంలోని ప్రజలు అధికారులకు సహకరించి మాక్ డ్రిల్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు.
సిటీ బ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): నగరంలో నేడు ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో కేంద్ర రక్షణ శాఖకు చెందిన బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా సైరన్ల మోత మోగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఎంపిక చేసిన ప్రాంతాలైన సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీలో ఎయిర్ రైడ్ డ్రిల్ జరుగుతుంది. 4.15 గంటలకు 30 నిమిషాల పాటు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. అన్ని కూడళ్లలో 2 నిమిషాల పాటు సైరన్లు మోగనున్నాయి. ఆ సమయంలో ఇండ్లలో ఉన్నవారు ఎలక్ట్రిక్ పరికరాలు, గ్యాస్ స్టవ్, లైట్లు ఆపేయాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఇండ్లు, భవనాల సెల్లార్లు, కట్టుదిట్టమైన స్థావరాలకు వెళ్లాలి. అప్పుడున్న ప్రదేశంలో ఆశ్రయం దొరక్కపోతే తలను దేనితోనైనా కప్పుకుని తక్కువ విస్తీర్ణమున్న ప్రదేశంలో దాక్కోవాలి. 4.30 గంటలకు ప్రమాదమే లేదని అధికారులు ప్రకటించిన తర్వాత బయటకు రావాలి. వదంతులను నమ్మకుండా ప్రభుత్వ అధికారుల ప్రకటనలు మాత్రమే అనుసరించాలి.
టీవీలు, ప్రసార మాధ్యమాలు, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి. ఈ మాక్ డ్రిల్‌లో మొత్తం 12 డిఫెన్స్ బలగాలు పాల్గొననున్నాయి. సైరన్లు మోగగానే మాక్ డ్రిల్ చేపట్టే ప్రాంతాలకు పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. భద్రతా బలగాలకు ఎలా సహకరించాలి. ఆత్మ రక్షణ ఎలా చేసుకోవాలో భద్రతా బలగాల అధికారులు కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.