దుండిగల్, జూలై 26: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ)కళాశాలలో 16వ స్నాతకోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి టాలెంట్ అక్విజేషన్ అండ్ క్యాంపస్ రిలేషన్స్ ఆపరేషన్ డెలివరీ నిపుణులు హర్దీప్ సింగ్ భమ్రా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 2020-24,2020-25 విద్యాసంవత్సరాలల్లో వివిధ విభాగాలల్లో బీటెక్ పూర్తిచేసిన 2,230 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హర్దీప్సింగ్ భమ్రా మాట్లాడుతూ.. అంకితభావం, ఆసక్తి , నిరంతరకృషితో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. కళాశాల వ్యవస్థ్ధాపక కార్యదర్శి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బహుళజాతి కంపెనీలల్లో 8,900 మందికి పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లను అందించినట్లు తెలిపారు.
బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఉన్నతస్థాయికి చేరుకుని తక కళాశాలతో పాటు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. కే శ్రీనివాసరావు పట్టాలు పొందిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ మర్రిలక్ష్మన్రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి ధీరేన్రెడ్డి, డైరెక్టర్ మర్రి అనుశ్రేయారెడ్డి, కోశాధికారి మర్రి మమత రాజశేఖర్‌రెడ్డి, వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.