హైదరాబాద్, మే 10 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని, సిద్ధాంత విరుద్ధమైన పోకడలను ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు (MLC Dasoju Sravan) తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా “గుజరాత్ మోడల్”ను కీర్తించడం వెనుక అసలు అంతర్యమేమిటి? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో సాగుతున్నది కాంగ్రెస్ పాలనా లేదా “బడే భాయ్” దోస్తానా ముసుగులో జరుగుతున్న బీజేపీ అనుకూల పాలనా? అని రేవంత్‌ను శ్రవణ్ నిలదీశారు.
గడిచిన 12 ఏళ్లుగా రాహుల్ గాంధీ “గుజరాత్ మోడల్” అనేది అది కొద్దిమంది కార్పొరేట్ శక్తుల దోపిడీ అని, సామాజిక విభజన అని దేశవ్యాప్తంగా పోరాడుతున్నారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం తన $1 ట్రిలియన్ ఎకానమీ కల సాకారం కావడానికి అదే గుజరాత్ నమూనాను బెంచ్ మార్క్‌గా తీసుకోవడం గమనార్హం. తన నాయకుడు ‘పీడకల’ అని అభివర్ణించే గుజరాత్ అభివృద్ధి నమూనాను.. ముఖ్యమంత్రి ‘స్వప్నం’ అని ఎలా అంటారు? అనిని డాక్టర్ శ్రవణ్ ప్రశ్నించారు.
గుజరాత్ నమూనాను పేదల వ్యతిరేక నమూనాగా కాంగ్రెస్ అధిష్టానం పరిగణిస్తుంటే.. రేవంత్ మాత్రం దాన్ని ఒక “అద్భుత విజన్” అని కొనియాడుతున్నారని శ్రవణ్ దుయ్యబట్టారు. ఇది కేవలం అభిప్రాయ భేదం కాదు, కాంగ్రెస్ సిద్ధాంతాలనే తుంగలో తొక్కి సాగిస్తున్న రాజకీయ కుట్రలా కనిపిస్తోందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక “ప్రైవేట్ ఫ్రాంచైజీ”లా నడుపుతూ, గాంధీ కుటుంబ రోడ్ మ్యాప్‌నకు పాతరేస్తున్నారా? అని ఎమ్మెల్సీ మండిపడ్డారు.
ప్రధాని మోదీ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ చూపిస్తున్న “బడే భాయ్” (పెద్దన్న) భక్తి ఇప్పుడు పరాకాష్టకు చేరిందని శ్రవణ్ ధ్వజమెత్తారు. కేంద్రం పట్ల ఆయన చూపిస్తున్న ఈ అతిశయ భక్తి ఏఐసిసి (AICC) జాతీయ వ్యూహానికి పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన పంథాను ‘సంక్షేమం’ నుండి ‘పెట్టుబడిదారీ’ విధానానికి మార్చేసిందని, గిఫ్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ కారిడార్ల పేరుతో ‘హస్తం’ గుర్తుతో గెలిచి ‘కమలం’ అజెండాను అమలు చేస్తున్నారని రేంత్ సర్కార్‌ను కడిగిపారేశారు శ్రవణ్.
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సాగిస్తున్న ఈ “అపవిత్ర కలయిక” వల్ల తెలంగాణకు నిజంగా లాభం చేకూరితే, ఆ ఆధారాలేవీ? అని శ్రవణ్ ప్రశ్నించారు. కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై, రాష్ట్రానికి వచ్చిన నిధులపై తక్షణమే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు.
ఈ “బడే భాయ్” బంధం వల్ల రాష్ట్ర ఖజానాకు అదనంగా వచ్చిన పైసలెన్ని?
తెలంగాణ ఎదుగుతోందా? లేదా కేవలం గుజరాత్ మోడల్‌కు కొత్త రంగులు పూసి అమ్ముతున్నారా?
అని ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సూటి ప్రశ్న వేశారు.
“తెలంగాణలో రాహుల్ గాంధీ అభివృద్ధి నమూనాను కాదని, మోదీ గుజరాత్ మోడల్‌ను అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక ఫ్రాంచైజీ హక్కులు ఇచ్చారా? అన్నది కాంగ్రెస్ పార్టీ తేల్చాలి” అని శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. జనం ఓటేసింది ‘హస్తం’ గుర్తుకు, కానీ అది ‘కమలం’లా పనిచేస్తుంటే చూస్తూ ఊరుకోరని.. తెలంగాణ ప్రజలు మోడీ నమూనాను కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారని శ్రవణ్ హెచ్చరించారు.