హిమాయత్‌నగర్, ఆగస్టు1: చేనేత కార్మికులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలన్నిటిని కొనసాగించాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహిళా విభాగం,వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో శుక్రవారం ఏర్పా టు చేసిన చేనేత వస్ర్త ప్రదర్శ నను అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కంద గట్లస్వామి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటుక రూప సదాశివంతో కలిసి ఎల్.రమణ ప్రారంభో త్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతి ప్రాచీనమైన చేనేత రంగం సంక్షోభంలో ఉందని ఈ రంగాన్ని కాపాడుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులపై చేనేత కార్మికులు పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
చేనేత వస్త్ర ప్రదర్శన మూడు రోజుల పాటు జరుగుతుందని చేనేత కార్మికులు తయారు చేసిన విభిన్న రకాల వస్ర్తాలు, వస్తువులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, నేతలు కమర్తపు మురళి, పోరండ్ల శారద, గుర్రం శ్రావణ్, శ్రీధర్, భాస్కర్, నోముల రేఖ, అంబటి శ్రీనివాస్, శశికళ, స్వప్న, స్వరూప, నిర్మల పాల్గొన్నారు.