బండ్లగూడ,డిసెంబర్ 26: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మర్ల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుమ్మరి సంఘం సభ్యులు, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు, నిమ్మలూరు శ్రీనివాస్, దూగుంట్ల నరేశ్ తదితరులు ఎమ్మెల్సీ కవితను గురువారం కలిసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయని అందులో బీసీలకు అధిక శాతం సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రాహుల్‌గాంధీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కుమ్మర్ల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. శాసన మండలి సమావేశంలో కుమర్ల సమస్యలపై చర్చిస్తానని తెలిపారు.