Secunderabad PG College | సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ, బేగంపేట్/కంటోన్మెంట్, జనవరి 27 : సికింద్రాబాద్ పీజీ కళాశాల లేడీస్ హాస్టల్లోకి శుక్రవారం అర్ధరాత్రి చొరబడిన వ్యక్తిని బేగంపేట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లి నివాసి అయిన శ్రీకాంత్ (35) గతంలో సికింద్రాబాద్ రసూల్పుర బాలంరాయి నీటి పంప్ హౌస్లో వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేశాడు.
ఇతని భార్య రసూల్పురలో ఉండడంతో శ్రీకాంత్ కూడా అత్తగారి ఇంటివద్దనే ఉంటున్నట్టు తెలిసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ స్నానాల గది కిటికీలో నుంచి చూస్తూ విద్యార్థినులకు అసభ్య సైగలు చేశాడు. విద్యార్థినులు కేకలు వేయగా పారిపోయేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సాయంతో విద్యార్థినులు వెంబడించి ఆగంతకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ విద్యార్థుల నినాదాలతో పీజీ కళాశాల ప్రాంగణం హోరెత్తింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని తరలించకుండా విద్యార్థులు తమ నిరసనతో అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని విద్యార్థులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
ఓయూలో వీసీ దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టళ్లలో విద్యార్థినులకు రక్షణ కల్పించలేని వీసీ ప్రొఫెసర్ రవీందర్యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పీజీ కళాశాల లేడీస్ హాస్టల్లోకి ఆగంతకుల ప్రవేశానికి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రొఫెసర్ రవీందర్యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, అంసా, ఎంఎస్ఎఫ్, ఏఎస్ఏ, టీఎస్యూ, టీఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గాల్లో దీపంలా విద్యార్థినుల భద్రత
కాంగ్రెస్ పాలనతో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతున్నది. అందుకు నిదర్శనం సికింద్రాబాద్లోని ఉస్మానియా పీజీ లేడీస్ హస్టల్ ఘటన. మొన్న ఓయూలో.. నిన్న సికింద్రాబాద్లో అమ్మాయిల వసతి గృహంలోకి దుండగులు చొరబడ్డారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత