మేడ్చల్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమానికి గుండె ధైర్యం ఇచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ సారే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్‌లో ప్రొఫెసర్ జయంశంకర్ సార్ విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మంచి మనిషులు పుట్టినప్పుడు భూమాత సంతోషిస్తుందని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టినప్పుడు తెలంగాణ తల్లి సంతోషపడి ఉంటుందని పేర్కొన్నారు. చిన్న తనం నుంచి కూడా జయశంకర్ ఆనాడు హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలపవద్దని కొట్లాడిందని చెప్పారు. ఆంధ్రాలో తెలంగాణన కలిపిన తర్వాత జరిగిన అనేక ఉద్యమాలలో పాల్గొని, ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమిస్తారో వారికి స్ఫూర్తిని జయశంకర్ సార్ ఇచ్చాడన్నారు.
ప్రొఫెసర్ వల్లే కేసీఆర్ సింహగర్జన
తెలంగాణను ఆంధ్రాలో కలపగానే జయశంకర్ సార్ బేజారు కాకుండా తెలంగాణను తిరిగి సాధించేలా 1949వ సంవత్సరం నుంచి తెలంగాణ, ఆంధ్రలకు ప్రతి సంవత్సరం డిపామెంట్ల వారీగా కేటాయించిన బడ్టెట్ల లెక్కలు రాసినట్లు కవిత పేర్కొన్నారు. ఆనాడు రాసిన లెక్కల వల్లే తెలంగాణకు జరుగుతున్న నష్టం తెలంగాణ ప్రజలకు తెలిసిందన్నారు. ఆ లెక్కల వల్లె కేసీఆర్ గులాబీ కండువా వేసుకుని 2001 నుంచి ఉద్యమం కొనసాగగా కేసీఆర్‌కు జయ శంకర్ సార్ వెన్నంటే ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న స్వచ్ఛమైన నాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని వదిలిస్తే తాను కేసీఆర్‌ను వదిలేస్తానని జయశంకర్ సార్ ఆనాడు ఖరాకండిగా చెప్పారన్నారు.
చరిత్ర సృష్టించిన సీఎం కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ సాధించి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ సార్, అమర వీరుల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేసినట్లు చెప్పారు. తెలంగాణను దేశంలో నెంబర్‌వన్ స్థానంలో నిలిపి ముఖ్యమంత్రి కేసీఆర్ అమర వీరులకు నిజమైన నివాళులు అర్పించినట్లు చెప్పారు. మేడ్చల్‌కు చెందిన అమర వీరుల కుటుంబ సభ్యులకు శ్రీను, ఆగమ్మలకు మంత్రి మల్లారెడ్డి సొంతంగా ఐదు లక్షలు విరాళం అందిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. మేడ్చల్‌లోని బార్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్, బేవరేజెస్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, మున్పిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, నాయకులు దయానంద్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, రాంప్రసాద్, స్వామి యాదవ్, మహిపాల్ రెడ్డి, పవన్, చంద్రారెడ్డి, లింగం, సచిన్, సందేశ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు వీరభద్రారెడ్డి, ప్రవీణ్, సత్యపాల్‌రెడ్డి, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.