కవాడిగూడ, జూలై 6: గురు భక్తితో ఏకలవ్యుడు చేసిన త్యాగం చరిత్రలో నిలబడిపోయిందని ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం, ఎరుకల ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నున్న కొమురంభీం విగ్రహం వద్ద ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత.. ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఏకలవ్య భవనాన్ని పూర్తిచేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎరుకల ఎన్పవర్మెంట్ స్కీంను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఏకలవ్య భవనాన్ని తర్వగా పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని కవిత స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, ఐక్య వేదిక చైర్మన్ రూప్సింగ్, కుతాడి రవికుమార్, శ్రీరామ్, సదానందం, ఆనంద్, శ్రీరాములు, సత్యానారయణ, ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్నారు.