బేగంపేట్, ఫిబ్రవరి 15 : అన్ని వర్గాలను సమానంగా చూసే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేట్ సర్ధార్ పటేల్ రోడ్డులోని వెస్లీ కళాశాల మైదానంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్ ఆధ్వర్యంలో బుధవారం దళిత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ అత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్‌చేసి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సహాకారంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అందుకే ఆయన అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పట్టు వదలని విక్రమార్కుడిలా రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని చక్కబెట్టే పనిలో ఉన్నారని ప్రతిఒక్కరూ బీఆర్ఎస్తో కలిసి ముందుకు రావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఐకమత్యంతో పోరాడిన వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించి పదవులు ఇచ్చారని చెప్పారు. మిగతా వారికి కూడా భవిష్యత్‌లో పదవులు తప్పక వస్తాయని కొంత ఓర్పుతో ఉండాలని సూచించారు. దేశ ప్రగతి కోసం నడుం బిగించిన కేసీఆర్‌కు అందరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ముఖ్యమంత్రి అండగా నిలబడ్డారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఐకమత్యంతో ముందుకు వెళితేనే రాజ్యాధికారం సాధిస్తాం
అనంతరం అంబేద్కర్ మనవడు డాక్టర్ రాజరత్నం మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ఐకమత్యంతో ముందుకు వెళితేనే రాజ్యాధికారం సాధిస్తామని అన్నారు. మాజీ మంత్రి రావేల కిశోర్‌బాబు, ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులను అనేక ఏళ్లుగా అంటరాని వారిగా పరిగణించడంతో వారిని క్రైస్తవ మిషనరీలు అక్కున చేర్చుకున్నాయని తెలిపారు. దళితులతో పాటు క్రైస్తవులకు అన్ని సమాన హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, సీఎస్ఐ సినార్డ్ మోడరేటర్ ధర్మరాజు, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన బిషప్‌లు, గజ్జెల నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.