సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం రెండు గంటల వరకే 78.57 శాతం ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు 112 మందిలో 88 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 31 మంది ఎక్స్అఫిషియో మెంబర్లలో 22 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
81 మంది కార్పొరేటర్లలో 65 మంది ఓటుహక్కును వినియోగించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 37.51 శాతం, మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68శాతం, మధ్యాహ్నం రెండు గంటల వరకు 78.57శాతం, సాయంత్రం నాలుగు గంటల వరకు 78.57శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్.. రిటర్నింగ్ అధికారితో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ముగిసిన ఆనంతరం బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్కు బందోబస్తుతో తీసుకువచ్చిన అనంతరం పరిశీలన చేసిన తర్వాత స్టా్రంగ్ రూంలో భద్రపరిచారు. స్టా్రంగ్ రూం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీ నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి డాక్టర్ ఎన్ గౌతంరావు నిలవగా.. ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు ఎంఐఎం పార్టీ అభ్యర్థి తరపున ఓటింగ్లో పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.