దుండిగల్,జనవరి13 : నిజాంపేట్, బాచుపల్లిలలోని డబుల్ బెడ్రూం ఇండ్లల్లో మౌలిక వసతులను కల్పిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్(MLA Vivekanand) అన్నారు. సోమవారం పేట్ బషీరాబాద్‌లోని ఎమెమ్ల్యే క్యాంపు కార్యాలయంలో బాచుపల్లి, నిజాంపేట్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల లబ్ధిదారులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాచుపల్లి, నిజాంపేట్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల వద్ద నెలకొన్న పలు సమస్యలను తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల వద్ద అధికారులతో సమావేశాలు నిర్వహించి, మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులు ఇండ్లల్లోకి చేరుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బహదూర్‌పల్లి, డీ.పోచంపల్లి, దుండిగల్ డబుల్ బెడ్రూం ఇండ్లలోని లబ్ధిదారులకు అన్ని వసతులతోపాటు బస్సు సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు.
ఇదేవిధంగా రానున్న రోజుల్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బాచుపల్లి, నిజాంపేట్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు మౌలిక వసతుల కల్పనతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీనాయక్, తదితరులు పాల్గొన్నారు.