Talasani Srinivas Yadav | బేగంపేట్, ఆగస్టు 12: రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్లో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును ఆయన ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి ప్రారంభించారు. ముందుగా స్కూల్ ఆవరణలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో ఎంతో మందికి శ్రీరామానంద తీర్థ మెమోరియల్ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ మెమోరియల్‌ను నిర్వహిస్తూ అభివృద్ధిలోకి తీసుకువచ్చిన మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మెమోరియల్ సభ్యులు చంద్రశేఖర్, శేఖర్ మారం రాజు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శేఖర్ ముదిరాజ్, నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.