బన్సీలాల్‌పేట్, మే 20 : ఉద్యోగులు, కార్మికులకు అండగా నిలిచేది గులాబీ జెండా అని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మారెడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జలమండలి బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 6వ తేదిన జరగబోయే మెట్రో వాటర్‌వర్క్స్ బోర్డు గుర్తింపు ఎన్నికల్లో గెలవడానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో రెండు సార్లు జలమండలి కార్మికులు బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ను గెలిపించారని గుర్తు చేశారు.
అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కార్మికులు, ఉద్యోగుల అనేక సమస్యలను నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జలమండలి ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి సరైన అవగాహన లేకుండా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిందని, సరిపడే సిబ్బంది లేకుండా పరిపాలన ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
సమస్యలపై పోరాడటానికి బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ లాంటి బలమైన గొంతుక కావాలని, అందుకే రాబోయే ఎన్నికల్లో బాణం గుర్తుకే ఓటు వేయాలని ఆయన కోరారు. గత ఎన్నికల్లో కూడా తమకు మద్దతుగా నిలిచిన తలసానిని కార్మిక సంఘం నాయకులు సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి ఎల్లమయ్య యాదవ్, శివశంకర్, నర్సింహ, జ్ఞానేశ్వర్, పాపయ్య, భూమయ్య, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్, అశ్విన్, ఖలీల్ ఉన్నారు.